ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధి అంశంపై టీడీపీ విడుదల చేసిన ‘టాకింగ్ పాయింట్స్’ ఇవీ.. ఈ ప్రకటనలో జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాల మధ్య స్పష్టమైన తేడా చూపించారు.
టీడీపీ వివరాల ప్రకారం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి మొత్తం రూ.8,480 కోట్లు అవసరం కాగా, జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసినది కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే. అంటే 18.2 శాతం ఖర్చు మాత్రమే జరిగింది. ఇక ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.786.82 కోట్లు ఖర్చు చేసి 9.2 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
జగన్ ప్రభుత్వ వేగంతో వెళ్లితే 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పట్టేదని, కానీ పిపిపి మోడల్‌లో కేవలం రెండేళ్లలోనే ఈ కాలేజీలు పూర్తి చేయగలమని టీడీపీ తెలిపింది.
జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీల్లో కేవలం 500 సీట్లు మాత్రమే వచ్చాయని, అందులో 213 కన్వీనర్ కోటా సీట్లు కాగా 287 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఉన్నాయని విమర్శించారు. కూటమి పిపిపి మోడల్‌లో 1,700 సీట్లు రావొచ్చని, అందులో 850 కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయని చెప్పారు.
జగన్ కాలంలో తీసుకున్న విధానాల వల్ల 20–25 ఏళ్లలో కొత్త డాక్టర్లు తయారు కావడమే కష్టమని, అయితే కూటమి పిపిపి మోడల్‌తో 20 ఏళ్లలో దాదాపు 50,000 మంది డాక్టర్లు సమాజానికి సేవ చేసే అవకాశం ఉందని వివరించారు.
జగన్ ప్రారంభించిన కాలేజీల్లో ఇన్‌పేషెంట్ బెడ్లు 2,500 మాత్రమే ఉన్నా, కూటమి ప్రణాళికలో 17 కాలేజీల్లో 8,500 బెడ్లు ఉంటాయని, వాటిలో 5,950 ఉచితంగా పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
టీడీపీ ప్రకారం జగన్ ప్రతిపాదించిన కాలేజీల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త మెడికల్ కాలేజీలను ఎయిమ్స్ స్థాయి సౌకర్యాలతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఇక పిపిపి మోడల్‌పై జగన్ చేస్తున్న విమర్శలను టీడీపీ ఖండించింది. “ఇది ప్రైవేటులకు ఇచ్చే ప్రాజెక్టు కాదు. నిర్మాణం, నిర్వహణ తర్వాత 33 ఏళ్లకు ఆస్తి ప్రభుత్వానికి తిరిగి వస్తుంది. పేదలకు ఉచిత వైద్యం అందేలా ఈ మోడల్ రూపొందించబడింది,” అని పార్టీ స్పష్టం చేసింది.
టీడీపీ విమర్శల సారాంశం – జగన్ హయాంలో వైద్య రంగానికి నష్టం జరిగిందని, ఇప్పుడు పిపిపి మోడల్‌తో ఆ లోటు తీర్చే ప్రయత్నం జరుగుతోందని చెబుతోంది.
