స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో ఈ రోజు కీలక వాదనలు చోటు చేసుకున్నాయి ఏసీబీ కోర్టులో.! టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున న్యాయ వాదులు, ఏపీ సీఐడీ తరఫున న్యాయవాదులు.. ఈ కేసుకు సంబంధించి బలమైన వాదోపవాదాలతో హీటెక్కించేశారు.
ఈ తరహా కేసుల విచారణకు సంబంధించి లైవ్ అప్డేట్స్‌ని కొన్ని సామాజిక మాధ్యమాలు, వెబ్ సైట్లు (న్యాయవాద వృత్తికి సంబందించినవారు నిర్వహిస్తున్నవి) ఇస్తుంటాయి. అవిచ్చే అప్డేట్స్ కోసం టీడీపీ, వైసీపీతోపాటు జనసేన శ్రేణులు.. పార్టీలతో సంబంధం లేని సామాన్యులూ ఎదురు చూశారు.
న్యాయవాది హరీష్ సాల్వే అలా అన్నారు.. దానికి ముకుల్ రహోత్గీ ఇలా కౌంటర్ ఇచ్చారు. దానిపై సిద్దార్ధ లూద్రా రివర్స్ ఎటాక్ చేశారు.. మధ్యలో బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.. అంటూ, అప్డేట్స్ వచ్చాయి. కొన్ని గంటలపాటు ఈ ప్రసహనం నడిచింది.
క్షణ క్షణానికీ ఉత్కంఠ. ఈ రోజు ఎలాగైనా చంద్రబాబుకి ఊరట కలుగుతుందని టీడీపీ శ్రేణులు నమ్మాయి. కానీ, వారి ఆశలు అడియాశలే అయ్యాయి. కోర్టులో న్యాయవాదుల వాదనలు వింటే, ఏ వెర్షన్‌కి ఆ వెర్షన్ వేరే లెవల్.
‘వకీల్ సాబ్’ సినిమా గుర్తుంది కదా.? అంతకు మించిన హై టెన్షన్ వాతావరణం, ట్వీట్ అప్డేట్స్‌లోనే కనిపించింది. వాదనలు ముగిశాక, తీర్పుని రిజర్వు చేసింది న్యాయస్థానం. రెండ్రోజుల్లో న్యాయస్థానం తీర్పు ఇవ్వబోతోందిట. సో, ఇక్కడికి ఈ ప్రసహనం ముగిసినట్లే.
కానీ, చంద్రబాబుకి ఊరట దొరుకుతుందనుకున్న తెలుగు తమ్ముళ్ళు తీవ్రంగా నిట్టూర్చాల్సి వచ్చింది. అప్పటిదాకా, ‘గెలిచేశాం..’ అనుకున్న తెలుగు తమ్ముళ్ళు, ఇప్పుడేమో తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం లేదేమోనని ఆందోళన చెందుతుండడం గమనార్హం.
అంటే, ఆపరేషన్ సక్సెస్‌గానీ.. పేషెంట్ పరిస్థితేంటో తెలియదన్న అయోమయం అన్నమాట.!
కాగా, ఈ కేసులో చంద్రబాబుకి ఊరట దక్కే అవకాశాలున్నాయని భావించిన వైసీపీ ప్రభుత్వం, వ్యూహాత్మకంగా మరో కేసులో చంద్రబాబుని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే వాదన తెరపైకొచ్చింది. ఫైబర్ నెట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబుని ఏ1గా చేర్చుతూ ఏపీ సీఐడీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం.