జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం సింఘానియా స్కూల్ ట్రస్ట్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఉండవల్లిలోని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసం లో సింఘానియా గ్రూప్ ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు.
ఈ ఒప్పందంలో భాగంగా తొలుత తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలలను ఎంపిక చేస్తారు. అక్కడ ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్, జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా సాంకేతిక అనుసంధానం వంటి అంశాలపై మార్పులు తీసుకొచ్చే అంశంపై చర్చించారు. ఐదేళ్ల వ్యవధిలో ఈ కార్యక్రమం ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు కూడా ఈ ట్రస్ట్ సేవలను విస్తరించనున్నారు.
సింఘానియా ప్రతినిధులతో భేటీ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..రాబోయే రోజుల్లో విద్యారంగంలో ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు అమలు చేస్తున్న మూస పద్ధతులకు స్వస్తి పలికి విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ కరిక్యులంలో సమూల మార్పులు చేస్తామని మంత్రి వెల్లడించారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం లభించేలా విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.