సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మంత్రి టాన్ సీ లెంగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం కీలక ప్రకటన చేశారు. ఏపీ, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
మంత్రి టాన్ సీ లెంగ్ మాట్లాడుతూ, భారత్‌లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, కార్యకలాపాలను విస్తరించేందుకు సింగపూర్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించామని వెల్లడించారు.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన, నిర్మాణ సహకారాన్ని అందించామని తెలిపారు. అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా గెలుచుకున్నాయని పేర్కొన్నారు.
అయితే, 2019లో ప్రభుత్వం మారిన తర్వాత సహకారం ఆగిపోవడంతో సింగపూర్ కన్సార్టియం అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాన్ సీ లెంగ్ తెలిపారు. గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో పని చేయకున్నా, భవిష్యత్తులో అమరావతి, ఏపీలో పట్టణాభివృద్ధి సహా పలు రంగాల్లో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
