సిద్ధార్థ లూథ్ర… ప్రస్తుతం ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగి పోతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తరపున తన వాదనలు ఈయన వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు లో సీనియర్ న్యాయవాది గా పనిచేస్తున్న ఈయన ఎన్నో వైట్ కాలర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్, ఎన్నికల సంస్కరణలు, ప్రాథమిక హక్కులు వంటి విధాన పరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆయన అనేక కేసుల్లో తన వాదనలు వినిపించారు.
ముఖ్యంగా వైట్ కాలర్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ కి సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపించేందుకు తెలుగుదేశం లూథ్ర ని ఆశ్రయించింది. ఈ కేసులో ఇటీవల జరిగిన విచారణలో లూథ్ర ఎంతో బలంగా వాదించినప్పటికీ చంద్రబాబుని రిమాండ్ నుంచి కాపాడలేకపోయారు. అయితే ఈరోజు ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
‘ అన్ని విధాల ప్రయత్నించినప్పటికీ న్యాయం దొరకనప్పుడు.. కత్తితో పోరాటం చేయడం ఉత్తమం’ అని గురు గోవింద్ సింగ్ చెప్పిన వ్యాఖ్యలను లూథ్ర ట్వీట్ చేశారు. న్యాయవాద వృత్తిలో ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న లూథ్ర ఒకసారిగా ఇలాంటి వ్యాఖ్యలు పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలకు అర్థమేంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ఈరోజు విచారణకి వచ్చింది. దీనిపై కౌంటర్ వేయడానికి సిఐడి కి ఈనెల 18 వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో లూథ్ర ఈ విధంగా ట్వీట్ చేయడంతో తెలుగుదేశం తర్వాత ఏం చేయబోతుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.