AP MLC Elections: మార్చి 23వ తేదీ.. మొత్తం 23 ఓట్లతో విజయం.! తెలుగుదేశం పార్టీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు.! 23 నంబర్ చుట్టూ గత కొంతకాలంగా అధికార వైసీపీ, ‘దేవుడి స్క్రిప్ట్’ అంటూ చేస్తున్న విమర్శలకు 2023వ సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ షాకులు తగులుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన నలుగురు ఎమ్మెల్యేల కారణంగా, టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టినా ప్రయోజనం వుండదని వైసీపీ భావించింది.
కానీ, అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది. గెలిపించుకుంది కూడా. పంచమర్తి అనురాధకి మొత్తంగా 23 ఓట్లు పడ్డాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి (వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు) సపోర్ట్ చేసినా, టీడీపీ బలం 21కి చేరింది. మరి, మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు.? ముమ్మాటికీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలే.! వాళ్ళెవరన్నదానిపై పెద్ద రచ్చే జరుగుతోంది.
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పులో కాలేశారు.. ఆయనే పొరపాటున టీడీపీ అభ్యర్థికి ఓటేశారు..’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడింటినీ టీడీపీ గెల్చుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ సీటుని టీడీపీ గెలుచుకుంది.
ఇదిలా వుంటే, టీడీపీతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. గత కొంతకాలంగా వైసీపీలో ఇమడలేకపోతున్న పలువరు వైసీపీ ఎమ్మెల్యేలు పక్కదారి చూస్తున్న వైనం మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, తాజా ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలోనూ స్పష్టమైపోయింది.
వైనాట్ 175 అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెబుతున్నారుగానీ.. ఈ పతనం ఇలాగే కొనసాగితే, వైసీపీ సింగిల్ డిజిట్‌కి వచ్చే ఎన్నికల్లో పరిమితమైపోతుందేమో.. అని టీడీపీ సహా విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.