రాజకీయాల్లో ఓడలు బళ్ళవడం.. బళ్ళు ఓడలవడం.. తెలిసిన విషయాలే.! మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
అయినా, రాష్ట్రంలో వుండని జగన్ ఎలా ప్రతిపక్ష నేత హోదాకి అర్హుడన్న చర్చ జరుగుతోంది. జగన్ కంటే షర్మిల బెటర్, ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై నినదిస్తోంది, ప్రెస్ మీట్లలో మీడియా సంధించే ప్రశ్నలకూ సమాధానమిస్తోందని వైసీపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం.
వైఎస్ జగన్ వీకెండ్ రాజకీయాలే చేస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి వస్తున్నారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు.! ఇలాగైతే ఎలా.? కూటమి దయతలచి వదిలేసిందిగానీ, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి ఘోర పరాజయం తప్పేది కాదు.!
బొత్స ఎటూ బీజేపీలోకి దూకేస్తారు గనుక, పదవితో దూకితే ఆయనకీ గౌరవం.. అన్న కోణంలో బీజేపీ సూచన మేరకు, టీడీపీ ‘ఎమ్మెల్సీ ఎన్నిక’ని లైట్ తీసుకుందన్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఎన్నిక కోసమే కొన్ని రోజులపాటు ఏపీలో వున్నారు వైఎస్ జగన్. పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథులతో చర్చించారు.. నానా హైరానా పడ్డారు. చివరికి ఎన్నికతో పని లేకుండానే బొత్స, ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయిపోయారు.
ఈ మొత్తం వ్యవహారంలో జగన్ వృధా ప్రయాస నవ్వులపాలవుతోంది. మరోపక్క, జగన్ కంటే షర్మిల బెటర్.. అని ఎమ్మెల్సీ ఎన్నిక వేళ చర్చ జరుగుతోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గనుక, కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మెప్పించి రాజ్యసభ పదవో, ఇంకో పదవో సంపాదించగలిగితే, ఏపీ రాజకీయాల్లో జగన్ కంటే షర్మిల కటౌట్ చాలా పెద్దదవుతుందనేవారూ లేకపోలేదు.
ఎందుకీ పరిస్థితి.? అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని షర్మిల విమర్శిస్తే.. షర్మిలకి జరిగే డ్యామేజ్ కంటే, షర్మిలను వైసీపీ విమర్శిస్తే, జగన్ మోహన్ రెడ్డికి జరిగే డ్యామేజ్ ఎక్కువవుతోంది మరి. సార్వత్రిక ఎన్నికల వేళ, షర్మిల ఇమేజ్‌ని వైసీపీ అలాగే పెంచింది, జగన్ ఇమేజ్‌ని అలాగే తగ్గించింది కూడా.!
షర్మిలని లైట్ తీసుకోకుండా, ఆమెని వైసీపీ ట్రోల్ చేయడం.. వైసీపీ పతనానికి, జగన్ పతనానికీ కారణమన్న చర్చ అంతటా జరుగుతోంది. షర్మిలను జగన్ ప్రసన్నం చేసుకుంటే తప్ప, వైసీపీకి మనుగడ వుండదనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయ్.
బొత్సకి ఇచ్చిన ఆ ఎమ్మెల్సీ పదవి ఏదో షర్మిలకు జగన్ ఆఫర్ చేసి వుంటే బావుండేదన్నది వైసీపీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ.
