ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికార అహాకారంతో, రాజకీయ ప్రత్యర్థుల్ని నానా రకాలుగా విమర్శించారు, దూషణలు చేశారు.. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని మహిళల్ని కూడా రాజకీయ విమర్శల్లోకి లాగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్, రాజకీయ విమర్శలు ఏ స్థాయికి దిగజారాయంటే, తోడబుట్టిన చెల్లెలు కట్టుకున్న చీర రంగుపైనా రాజకీయ విమర్శలు చేసే స్థాయికి.! చెల్లెలు షర్మిల మీద వైసీపీ నాయకులతోనే అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తన అన్న, తనను అంతలా దూషిస్తుంటే, తట్టుకోలేక షర్మిల పలు సందర్భాల్లో కంటతడిపెట్టారు కూడా. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలిగా వున్నారు వైఎస్ షర్మిల. సోదరుడిపై రాజకీయ విమర్శలు చేయడంలో, పరిపక్వత ప్రదర్శిస్తున్నారామె.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన హడావిడిపై సోషల్ మీడియా వేదికగా ట్వీటేస్తే, దానికి కాంగ్రెస్ నేతగా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో, ‘ప్రధాని మోడీకి దత్త పుత్రుడు జగన్ రెడ్డి’ అంటూ షర్మిల ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్, తన రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా పదే పదే ‘దత్త పుత్రుడు’ అంటూ విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే ‘దత్త పుత్రుడు’ అనే విమర్శని వైఎస్ జగన్, తన సోదరి నుంచే ఎదుర్కొంటుండడం గమనార్హం.
‘దత్త పుత్రుడు జగన్ రెడ్డి’ అంటూ వైఎస్ షర్మిల చేసిన విమర్శ, అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు మీడియాలోనూ ఇంకో పక్క సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.కాగా, పక్కలో బల్లెంలా తయారైన షర్మిల వ్యవహారంపై వైఎస్ జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చెల్లెలు షర్మిలతో ఆస్తుల పంపకాల గొడవలు, రాజకీయ పరమైన వివాదాలను పరిష్కరించుకునేందుకు ఓ వైపు రాయబారాలు నిర్వహిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
