చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే పిల్లల్లో పాజిటివ్ దృక్పథం అంత వేగంగా పెరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సృజనాత్మకత, విలువలు పెంచడం సమాజ భవిష్యత్తును దృఢంగా నిలబెడుతుందని చెప్పారు. గురువులు చెప్పే చిన్న గద్దింపులు కూడా జీవితంలో పెద్ద ఆశీర్వాదాలుగా నిలుస్తాయని పవన్ గుర్తుచేశారు. పాఠశాలలను రాజకీయ వేదికగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి వారిపై తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేల ఎకరాలు దోచుకునే పరిస్థితుల్లో పాఠశాలలకు ఆటస్థలాలు కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
కేరళ తరహాలో విద్యార్థి–తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరమని పవన్ అన్నారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లు విద్యార్థుల బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులను కేవలం జీతగాళ్లుగా కాకుండా దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదని పేర్కొన్నారు. చిన్ననాటి తన సోషల్ టీచర్ చెప్పిన దేశభక్తి పాఠాలే తనపై ప్రభావం చూపాయని పవన్ తెలిపారు.
పాఠశాలలో గ్రంథాలయంలో పుస్తకాలు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించిన పవన్, పెద్ద మొత్తంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ పుస్తకాలతో పాటు బీరువాలు అందిస్తానని ప్రకటించారు. అదేవిధంగా 25 కంప్యూటర్లను పాఠశాలకి అందజేస్తానని తెలిపారు. ఆట స్థలం కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గతంలో మైసూరవారిపల్లెలో ఆటస్థలం లేకపోవడంతో స్వంతంగా కొనుగోలు చేసి ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
చదువు మనల్ని ఎప్పటికీ నిలబెట్టే శక్తి అని, పుస్తకాలు చదవడం వ్యక్తిత్వాన్ని నిర్మించే గొప్ప సాధనమని పవన్ అన్నారు. గ్రూప్ లైబ్రరీలు ఏర్పాటు చేసి పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంపొందించాలన్నారు. మార్కుల కోసం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదవాలని, అబ్దుల్ కలాం తమిళ మీడియంలో చదివినా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఉదాహరణను ప్రస్తావించారు. ప్రతి విద్యార్థిలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని, దానిని వెలికితీయడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. పిల్లలు సినిమాల పిచ్చిలో పడకుండా, గొప్ప శాస్త్రవేత్తలు, మహనీయుల జీవితం వారికి చెప్పాలని సూచించారు.
గంజాయి, మాదకద్రవ్యాలు సమాజాన్ని వేగంగా నాశనం చేస్తున్నాయని పవన్ స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వ హయాంలో ఇవి చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో కూడా వ్యాపించాయని తెలిపారు. విద్యార్థులు దీనికి బారిన పడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కఠినంగా నిగ్రహం పాటించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం గంజాయి వ్యాప్తిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర క్రిస్టినా, ఇంటర్మీడియట్ శాఖ డైరెక్టర్ పి. రంజిత్ బాషా, కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తదితరులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ విద్యార్థులతో మమేకమై వారి సైంటిఫిక్ మోడల్స్, హ్యాండీక్రాఫ్ట్‌లు చూసి అభినందించారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి పిల్లల సామర్థ్యాలను గుర్తించిన ఆయన, ప్రతి విద్యార్థి ఉత్తమ భవిష్యత్తు కోసం ఇటువంటి మీటింగ్‌లు దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమం మొత్తం విద్య, విలువలు, క్రమశిక్షణ, సృజనాత్మకత, మాదకద్రవ్యాల నిరోధం వంటి అంశాలను ప్రాముఖ్యతగా చర్చించడంతో విద్యార్థుల అభ్యున్నతికి ఇది కీలకంగా నిలిచింది.
