Arya Parvathi: బాలీవుడ్ లో 2018 లో వచ్చిన ‘బదాయి హో’ చిత్రం గుర్తుందా!.. పెళ్లికి ఎదిగొచ్చిన కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే సమయానికి తన తల్లి గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ షాక్ అవుతారు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది. అచ్చం ఈ సినిమాలాంటి ఘటనే నిజ జీవితంలో కేరళలో చోటుచేసుకుంది. మలయాళీ సీరియల్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది ఆర్య పార్వతి. ప్రస్తుతం ఆమె వయసు 23 ఏళ్లు. మరి కొన్ని రోజుల్లో తనకు తోబుట్టువు పుట్టనుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొన్ని రోజుల క్రితం నెటిజన్స్ కు షాక్ ఇచ్చింది.
తాజాగా పార్వతి తల్లి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన తల్లికి ఎనిమిదవ నెల వచ్చే వరకు తనకి ఈ విషయం తెలియదని చెప్పింది. ఏడో నెల వచ్చే వరకు పార్వతి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియకపోవడం మరో ట్విస్ట్. తన తల్లి రెండోసారి గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు పార్వతి షాక్ అయిందట. ఈ విషయం బయటకు తెలిస్తే సమాజం ఎలా తీసుకుంటుందోనని పార్వతి తండ్రి భయపడ్డారట.
‘ ప్రస్తుతం మా అమ్మ వయసు 47 ఏళ్లు. నాకు ఈ విషయం తెలియగానే ఏడ్చేశాను. తర్వాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నాకు చెల్లి ఉంటే బాగుండేదని చిన్నప్పుడే అనుకునేదాన్ని. ఇప్పుడా కోరిక తీరింది. ప్రస్తుతం అమ్మ, చెల్లి బాధ్యతని నేనే తీసుకున్నా’అంటూ పార్వతి సంతోషం వ్యక్తం చేసింది. పార్వతి జన్మించాక తన తల్లి గర్భాశయంలో సమస్య తలెత్తింది. ఇక ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారట. అయినప్పటికీ 23 ఏళ్ల తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వడంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.