సినిమాల్లో జరిగిన కథలు చూసి అబ్బుర పడిపోతాం. కానీ అసలు సినిమాల్లోని కథలన్నీ కూడా మన మధ్య జరిగేవే. కాకపోతే వాటిని మనం గమనించకపోవచ్చు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సినిమాటిక్ లెవల్లో ఓ స్టోరీ జరిగింది. ఇది వినడానికి కూడా భలేగా అనిపిస్తుంది. అబ్బాయి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత భర్త జైలుకు వెళ్లడం.. చివరకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇదంతా భలే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. ఓ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మైనర్ కావడంతో ఆ భర్త జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
తెలిసి, తెలియక చేసిన తప్పుకు పెద్ద శిక్ష పడింది. ఇక వారికి పుట్టిన పాపను శిశు విహార్ కు అందించారు అధికారులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పుల్లల చెరువు మండలానికి చెందిన భాస్కర్ రెడ్డి నందిత అనే అమ్మాయిని 2022లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమె గర్భవతి కూడా. కానీ ఆమె పెళ్లి సమయానికి మైనర్. ఈ విషయం కాస్తా పోలీసుల వరకు వెళ్లడంతో మైనర్ ను గర్భవతి చేయడమే కాకుండా పెళ్లి చేసుకున్నాడని కేసు నమోదైంది. ఆయనకు జైలు శిక్ష కూడా పడింది.
ఇక 2023లో నందిత ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా ఆ పాపను శిషు మందిర్ కు అప్పగించారు. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులకు దూరమైంది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి జైలు నుంచి విడుదలయిన తర్వాత.. నందిత మేజర్ కూడా అయింది. ఇప్పుడు వారిద్దరూ చట్టబద్ధంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు. తమ పాపను ఇవ్వాలంటూ వేడుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. వారి గురించి మొత్తం విన్న ఆమె.. తోటి అధికారులతో కలిసి పాపను తల్లిదండ్రులకు అప్పగించింది. దీంతో కథ సుఖాంతం అయింది.