టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే టాలీవుడ్ సత్యభామ జమున మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరువక ముందే నేడు తెల్లవారు జామున ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు.
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ చెన్నైలోనే తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్నో గుర్తుండి పోయే సినిమాలను అందించిన సాగర్ పలువురు హీరోలకు సక్సెస్ లను అందించాడు.
రాకాసి లోయ చిత్రంతో దర్శకుడిగా సాగర్ కెరీర్ ని ప్రారంభించాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తో అమ్మ దొంగ అనే సినిమాను రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, ఓసి నా మరదలా, అన్వేషణ తదితర సినిమాలను రూపొందించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.
గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం వ్యవహరించి ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చాడు. మూడు సార్లు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సాగర్ పనిచేశారు. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.