ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పాత్రికేయ రంగంలో ఆయనది 55 ఏళ్ల అనుభవం. ఆయన మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘పాత్రికేయ రంగంలో.. ప్రత్యేకించి సినీ జర్నలిజంలో విశేష అనుభవం ఉన్న గుడిపూడి శ్రీహరి మరణ వార్త తెలిసి చింతించాను. తెలుగు, ఇంగ్లీషు పత్రికల్లో సినీ విమర్శకుడిగా ఆయన రాసిన వ్యాసాలు, రివ్యూలు ఆసక్తి రేకెత్తించేవి. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమా, రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయన రాసిన ‘హరివిల్లు’లో వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలనకు నిదర్శనం. గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని అన్నారు.