డిప్యూటీ సీఎం అయితే మాత్రం.. చూసీ చూడనట్టు వదిలెయ్యాలిగానీ, సముద్రంలోకి వెళ్ళిపోవడమే.!
పిఠాపురం ఎమ్మెల్యేవి అయితే మాత్రం, ఆ నియోజకవర్గానికి కూతవేటు దూరంలో వున్న కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగితే ఎగేసుకుంటూ వెల్ళిపోవడమేనా.?
ఏ ప్రభుత్వం అయినాసరే, అక్రమాలు మామూలే. ఎందుకంటే, అక్కడ కాకినాడ పోర్టు వేదికగా అక్రమాలకు పాల్పడుతున్నది పెద్ద పెద్ద డాన్‌లు మరి.! బియ్యం దొంగలు, రాష్ట్ర ప్రజల పొట్టగొడుతోంటే, చూసీ చూడనట్టు వదిలెయ్యాలంతే.!
ఇంతేనా.? ఇలాగే అనుకోవాలా.? పవన్ కళ్యాణ్‌కీ, మిగతా రాజకీయ నాయకులకీ స్పష్టమైన తేడా వుంది. సినిమాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్‌ని పవర్ ఫుల్‌గా చూస్తామనుకుంటే కుదరదు. ఆయన నిజ జీవితంలోనూ అలాగే వుంటారు. రాజకీయాల్లో మరింత పవర్ ఫుల్‌గా వుండాలనుకుంటారు, వుంటారు కూడా.!
లేకపోతే, సముద్రంలోకి వెళ్ళిపోవడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే అని తెలిసీ, పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా ఎలా వెళ్లిపోయారు.? సీజ్ ది షిప్.. అని అనడమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా వస్తే, తానే చూసుకుంటానని చెప్పడం.. పవన్ కళ్యాణ్‌కి మాత్రమే చెల్లుతుంది.
అసలేంటి కథ.? కాకినాడ పోర్టు వేదికగా, బియ్యం ఎగుమతులు కొత్తేమీ కాదు. కాకపోతే, పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు, వేల కోట్లు వెచ్చించి సమకూర్చుతున్న బియ్యం అది. దానికి మసిపూసి మారేడుకాయ చేసి.. కాకినాడ పోర్టు వేదికగా అక్రమ ఎగుమతులకు పాల్పడుతున్నారు.
వైసీపీకి ఇదే ప్రధాన ఆదాయ వనరు అనీ, దీని వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వున్నాడనీ.. చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ‘మేం అధికారంలోకి వస్తే, అన్ని అరాచకాల్నీ బయటపెడతాం..’ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా, వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికీ, అలాగే వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఈ బియ్యం అక్రమ ఎగుమతులు ఓ కారణంగా చెబుతారు. అలాంటప్పుడు, ఆ అక్రమాల్ని కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలా.? వద్దా.? కూటమి అధికారంలోకి వచ్చి రోజులు, నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్, ఎన్నిసార్లు తనిఖీలు నిర్వహించినా, దోషులపై చర్యలుండడంలేదు.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సముద్రంలోకి వెళ్ళారు, అధికారుల్ని వెంటేసుకుని. విషయాన్ని ఆరా తీశారు, జరుగుతున్న ఘోరాల్ని బహిర్గతం చేశారు. అధికారుల అలసత్వాన్నీ నిలదీశారు.
దాంతో, దేశవ్యాప్తంగా ‘సీజ్ ది షిప్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొత్తం దేశమంతా, కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న అక్రమాల గురించి చర్చించుకుంటోంది. ఇది ఓ రకంగా కూటమి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్లే భావించాలి.
కానీ, టీడీపీకి చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, చిత్రంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలు పెట్టాయ్. చూస్తోంటే, ఆ హ్యాండిల్స్‌కి వైసీపీ నుంచి పేమెంట్ అందుతున్నట్లుంది. లేకపోతే, కూటమి ప్రభుత్వానికి మంచి పేరొచ్చేలా పవన్ కళ్యాణ్ తన ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేస్తున్నారన్న విజ్ఞత లేకుండా ఈ హ్యాండిల్స్ ఎలా వ్యవహరిస్తాయ్.?