సినిమా సినిమాకూ ఇంప్రూవ్ అవుతోన్న కిరణ్ అబ్బవరం గతేడాది ఎస్ఆర్ కళ్యాణమండపంతో డీసెంట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నమైన కథతో సెబాస్టియన్ పిసి 524తో మన ముందుకు వచ్చాడు. ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
రాయలసీమలోని మదనపల్లెలో జరిగే కథ ఇది. యువతి నీలిమ (కోమలీ ప్రసాద్) మర్డర్ చుట్టూ కథ నడుస్తుంది. అదే సమయంలో కానిస్టేబుల్ అయిన సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) డ్యూటీలో ఉంటాడు. తనకు రేచీకటి కూడా ఉంటుంది.
మరి నీలిమను హత్య చేసింది ఎవరు? ఈ కేసుకి సెబాస్టియన్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ మిస్టరీని రేచీకటి ఉన్న సెబాస్టియన్ ఎలా చేధించాడు అన్నది మిగతా కథ.
నటీనటులు:
కానిస్టేబుల్ గా కిరణ్ అబ్బవరం నటన డీసెంట్ గా సాగింది. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో బాగానే చేసాడు. అయితే ఈ యాంగిల్ ను కథలో సరిగా వినియోగించుకోలేదు అనిపిస్తుంది. అయితే ఉన్నంతలో కిరణ్ కథకు న్యాయం చేయాలనే చూసాడు.
కోమలీ ప్రసాద్ కు చిత్రంలో కీలకమైన పాత్ర దొరికింది. కథ దాదాపుగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. కొని సీన్స్ లోనే కనిపించినా కానీ ఆమె ఇంప్రెస్ చేస్తుంది. హీరో తల్లిగా సీనియర్ నటి రోహిణి క్యామియో పాత్రలో మెరుస్తారు.
ఇక సూర్య, నువేక్ష కీలకమైన పాత్రల్లో మెప్పిస్తారు. ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, రవితేజ సపోర్టింగ్ రోల్స్ లో బాగానే చేసారు.
సాంకేతిక నిపుణులు:
రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో వాడిన లైటింగ్, కెమెరా ఫ్రేమ్స్ మెప్పిస్తాయి. విప్లవ్ నైషధం ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఘిబ్రన్ సంగీతం అవసరమైనదానికంటే ఎక్కువగా సాగింది. ఎక్కువ సౌండ్స్ తో రణగొణధ్వని ఫీలింగ్ కలిగిస్తుంది. అంత స్కోర్ ఇచ్చేంత సత్తా అక్కడ సీన్ లో కనిపించదు. ఏం లేని దీనికి ఎందుకీ గోల అనిపించక మానదు. సాంగ్స్ వరకూ పర్వాలేదు.
ప్రొడక్షన్ డిజైన్ పరంగా ఎక్కువగా మదనపల్లె చుట్టు పక్కల న్యాచురల్ లొకేషన్స్ లోనే సాగింది ఈ చిత్రం. బడ్జెట్ పరిమితులకు లోబడి చిత్రీకరించబడిన ఈ చిత్రం దానికి తగ్గట్లుగానే ఉంది.
ఇక దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి విషయానికొస్తే ఒక మర్డర్ మిస్టరీకి, హీరో రేచీకటికి ముడిపెట్టిన విధానం బాగుంది. కానీ తన ఎగ్జిక్యూషన్ విషయంలోనే సమస్య అంతా ఉంది. ఇక్కడ బోలెడన్ని లోపాలు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త రేసీగా ఉంటే మరింత బాగుండేది.
పాజిటివ్ పాయింట్స్:
- కిరణ్ అబ్బవరం
- సినిమాటోగ్రఫీ
నెగటివ్ పాయింట్స్;
- స్క్రీన్ ప్లే
- బలమైన పాత్ర చిత్రణ లేకపోవడం
చివరిగా:
క్రైమ్ డ్రామాగా రూపొందిన సెబాస్టియన్ సరైన సీన్స్ పడక ఇబ్బంది పడింది. కిరణ్ అబ్బవరం నటన పక్కన పెడితే ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికంటూ ఏం లేదు.