సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. జనవరి 14న వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఈ క్రమంలోనే ఆరో రోజు సంచలన రికార్డు నమోదు చేసిందని మేకర్స్ తెలిపారు. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.12.5 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రూ.16.12 కోట్ల షేర్ వసూలు చేసి రాజమౌళి త్రిబుల్ ఆర్ రికార్డులను బద్దలు కొట్టేసిందని మూవీ యూనిట్ ప్రకటించింది.
త్రిబుల్ ఆర్ మూవీ ఆరో రోజు రూ.9 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిందని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ ను క్రాస్ చేసినట్టు చెప్పారు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లు రాబడుతోందంట. నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ ను ఆరు రోజుల్లోనే క్రాస్ చేసిందని.. ఈ మూవీ లాంగ్ రన్ లో 3 మిలియన్ మార్క్ నుకూడా క్రాస్ చేయొచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. నార్త్ అమెరికాలో గతంలో వెంకటేశ్ సినిమాలకు ఎన్నడూ రానంత రెవెన్యూ వస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ పరంగా అందరికీ ఈ సినిమానే బాగా నచ్చింది.
అందుకే ప్రేక్షకులు సంక్రాంతి సెలవుల్లో ఈ మూవీని చూసేందుకు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో మరింత కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మేకర్స్.