అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి అంటే, ఎందుకంత అసహ్యం.? నో డౌట్, వైసీపీ గత కొన్నేళ్ళుగా అమరావతిపై అసహ్యం పెంచుకుంటూనే పోతోంది. కారణాలేంటి.? అన్నది వైసీపీ శ్రేణులకే అర్థం కాని పరిస్థితి.
రాజకీయాల్లో విమర్శలు సహజం. తెలుగు దేశం పార్టీ మీద వైసీపీకి వున్న రాజకీయ వైరం కాస్తా, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీకి అసహ్యం పెరిగిపోయేలా చేసిందని అనుకోవచ్చు. కానీ, ఇదెక్కడి పంచాయితీ.?
అమరావతిపై కమ్మరావతి, స్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం.. ఇలా కుప్పలు తెప్పలుగా అడ్డగోలు ఆరోపణలు చేసింది వైసీపీ. అమరావతి మహిళా రైతుల మీద, వైసీపీ నేతలు చేసిన నీఛమైన వ్యాఖ్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారంలో వున్నప్పుడు అమరావతిపై వైసీపీ నేతలు అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
అధికారం పోయాక కూడా, వైసీపీకి ఈ విషయంలో బుద్ధి రాలేదు. ఇంకా అదే పైత్యం. తాజాగా, వైసీపీకి చెందిన సాక్షి ఛానల్ ఏ స్థాయిలో అమరావతిపై ‘సెక్స్ వర్కర్ల కేంద్రం’ అంటూ జుగుప్సాకరమైన చర్చ నిర్వహించిందో చూశాం.
ఈ నేపథ్యంలోనే, సాక్షి యాజమాన్యం సహా, సాక్షి ఉద్యోగి (జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు) అలాగే, ఇంకో సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి.
మరోపక్క, వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణా రెడ్డి ‘సంకర తెగ’ అంటూ, అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి మహిళలపై సాక్షి మీడియా ‘సెక్స్ వర్కర్లు’ అనే ముద్ర వేసిన దరిమిలా, అమరావతి మహిళలు, సాక్షి కార్యాలయం యెదుట నిరసన వ్యక్తం చేయడాన్ని సజ్జల జీర్ణించుకోలేకపోయారు.
సజ్జల చేసిన ‘సంకర వ్యాఖ్యలు’, అమరావతిపైనా, మహిళలపైనా వైసీపీకి వున్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఒక్క క్షమాపణ.. ఒకే ఒక్క క్షమాపణతో సద్దుమణిగిపోయే విషయాన్ని.. ఇంకా ఇంకా పెచ్చగొడుతున్నది వైసీపీనే.
‘సంకర తెగ’ చిన్న మాట కాదు.! వైసీపీలోని మహిళా నేతలూ ఈ ‘సంకర తెగ’ వ్యాఖ్యల్ని సమర్థించలేని పరిస్థితి కనిపిస్తోంది.
