టీజర్ చూస్తే చాలు, సినిమా చూసినంత ఫీలింగ్ కలుగుతుంటుంది. ట్రైలర్ చూశాక, సినిమాని ఇంకెంత బాగా చూపించగలరు? అన్న అభిప్రాయం వెంటాడుతుంది. ఆ కోవలోకే వస్తుంది ‘ఓ బేబీ’. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ అదిరిపోయిందంతే. ట్రైలర్ చూశాక ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇదే. బహుశా, సినిమాని ఇంతకన్నా బాగా చూపించి వుండరేమో.. అన్న భావన కలిగితే అది మీ తప్పు కానే కాదు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాని ఆల్రెడీ చూసేశారట. 70 ఏళ్ళ భామలా సమంత నటించడం కాదు, 70 ఏళ్ళ అనుభవం వున్న నటిగా మెప్పించిందని చెప్పారాయన తన రివ్యూలో. నూటికి నూరుపాళ్ళూ నిజమిది. ట్రైలర్ చూశాక ఎవరైనాసరే, సమంత నటనానుభవాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఏ ఫ్రేమ్‌లోనూ సమంత మనకి కన్పించదు. 70 ఏళ్ళ వయసున్న ఓ ముదుసలి, అనుకోకుండా 24 ఏళ్ళ యువతిలా మారిపోతే ఎలా వుంటుందో.. అలాగే సమంత కన్పించింది.
సమంత నిజానికి నటించలేదు, ఆ పాత్రలో జీవించేసింది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి ఇది తెలుగు రీమేక్. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’ జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో ఒక్కో పాత్రనీ దర్శకురాలు నందిని రెడ్డి చూపించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆగండాగండీ, ట్రైలర్ చూసి.. సినిమా రివ్యూ చెప్పేయడమేంటంటారా.? అంత కంటెంట్ వుంది మరి ట్రైలర్‌లో.
70 ఏళ్ళ నానమ్మ 24 ఏళ్ళ యువతిలా మారిపోయిందని తెలియని మనవడు, తన నానమ్మకే ఐ లవ్ యూ చెప్పే సందర్భమొస్తే, ఆ నానమ్మ పరిస్థితేంటి.? 24 ఏళ్ళ యువతిగా మారిపోయాక.. డెబ్భయ్యేళ్ళ వయసున్న ముదుసలిగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడమెలా సాధ్యం.? ఇలా అన్నీ ఆశ్చర్యకరమైన సంఘటనలే కన్పిస్తాయి సినిమాలో.
నాగ శౌర్య – సమంత కెమిస్ట్రీ, అడివి శేష్ – సమంతల మధ్య ఎమోషన్.. వీటన్నిటికీ మించి రావు రమేష్ – రాజేంద్రప్రసాద్ మధ్య హాస్యపు జల్లులు.. ఒకటేమిటి.? అన్నీ అద్భుతాలే అనదగ్గ రీతిలో వుంది ట్రైలర్. పెళ్ళయ్యాక సినిమాల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్న సమంత, ఈ ‘ఓ బేబీ’తో మరో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగానే కన్పిస్తోంది.