Samantha: జీవితంలో ఎదురైన అనుభవాలతో గతం కంటే ఇప్పుడు తానెంతో బలంగా తయారయ్యానని నటి సమంత (Samantha) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడారు. ‘జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్యం ఉండాలి. అప్పుడు విజయం సాధ్యమవుతుంది. మూడేళ్లుగా జీవితం గురించి ఎంతో నేర్చుకున్నాను. పరిస్థితులకు తగ్గట్టు నన్ను నేను మలచుకున్నాను’.
‘వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన, ధ్యానం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మానసికంగా ధృడంగా తయారయ్యాను. వృత్తిగతంగా కూడా నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. దైవ చింతన మనలో చాలా మార్పు తీసుకొస్తుంది. నేడు చాలామంది చిన్న వయసులోనే మానసిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వారికి దైవ చింతన ఎంతో సహాయపడుతుంది’.
‘వృత్తిగతంగా ఒకే తరహా పాత్రలకు దూరంగా ఉంటున్నా. నా పాత్ర కొత్తగా, బలంగా ఉండాలి. ప్రస్తుతం నటీమణులకు అటువంటి పాత్రలు డిమాండ్ చేసే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం నా తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నానని చెప్పుకొచ్చా’రు. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటించనున్నారు.