అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి మొన్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇంతటి విజయాన్ని దక్కించుకున్న తర్వాత బాలీవుడ్ వెళ్లకుండా ఎలా ఉంటుంది. ఈమద్య కాలంలో తెలుగు సినిమాలను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ గుత్తా పట్టినట్లుగా వరుసగా రీమేక్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పలు తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నాడు. అందుకే ఆయన మరోసారి తెలుగు సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అల్లు అర్జున్ ఇమేజ్‌కు బాగా సూట్ అయిన ఈ స్టోరీ సల్మాన్ ఇమేజ్‌కు కూడా సూట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సల్మాన్ సన్నిహితుడు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ఏడు కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉండగా నిర్మాతలు పది కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
మరో వైపు అల్లు అరవింద్ స్వయంగా ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశ్యమై ఆలోచనలో ఉన్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హిందీలో ప్రస్తుతం జెర్సీని రీమేక్ చేస్తున్న అల్లు అరవింద్ ఆ తర్వాత అల వైకుంఠపురంలో రీమేక్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎవరు రీమేక్ చేసినా కూడా సల్మాన్ ఖాన్ బంటు పాత్రలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా బీ టౌన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
