Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి పేరు అలాగే విజయసాయిరెడ్డి పేరూ వినిపించేవి. ఇప్పుడు సీన్ మారింది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణా రెడ్డి హవా వైసీపీలో పెరిగిందో (అంటే, అన్నీ తానే అయి వ్యవహరించడం మొదలు పెట్టారో) అప్పటినుంచే కథ మారింది. ‘డిఫాక్టో సీఎం’ అనే గుర్తింపు, సకల శాఖా మంత్రి అనే గుర్తింపు.. ఇవన్నీ వచ్చాక, వైసీపీ పతనం ప్రారంభమయ్యిందనే చర్చ వైసీపీలోనే జరుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అందునా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మట్టికరిచేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘కోటా’ ఎమ్మెల్సీల ఎన్నికల వ్యవహారం వేరు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం వేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చాలా చాలా భిన్నం, సంక్లిష్టం కూడా. సాధారణ ఎన్నికల్ని తలపిస్తాయివి. ‘పట్టభద్రుల్లో చాలామందికి సంక్షేమ పథకాలు అందవు. అందుకే, ఆ విభాగంలో మాకు వ్యతిరేకంగా ఫలితం వచ్చినట్లుంది..’ అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా సెలవిచ్చారు. ‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం సాధారణ ఎన్నికలపై వుండదు’ అని కూడా అంటున్నారాయన.
చూస్తోంటే, వైసీపీని నిండా ముంచెయ్యడమే సజ్జల రామకృష్ణా రెడ్డి వెన్నుపోటు వ్యూహంలా కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో ‘వైసీపీ వారియర్స్’ ఆరోపిస్తున్నారు. ‘ఇప్పటికైనా వాస్తవాల్ని అధినాయకత్వానికి తెలియజేయాలి.. సజ్జల లాంటోళ్ళని నమ్ముకుంటే, వై నాట్ 175 కాదు.. ఓన్లీ వన్‌కే పరిమితమవుతాం’ అని వైసీపీ నెటిజన్లే తిట్టిపోస్తున్నారు. ‘కుప్పం సంగతి తర్వాత, ముందైతే పులివెందుల కాపాడుకో జగనన్నా..’ అని వైసీపీ నెటిజన్లు నినదిస్తున్నారంటే, పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అయినా, ‘ఏం కాలేదు..’ అని సజ్జల అంటున్నారంటే, సమ్‌థింగ్ ఫిషీ.!