వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ‘ప్రజా తీర్పు’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇటీవలి ఎన్నికల్లో ఫలితాల విషయమై మాకు అనుమానాలున్నాగానీ.. ఆ ఫలితాల్ని ప్రజా తీర్పుగానే భావించాల్సి వుంటుంది..’ అంటూ ‘ది గ్రేట్’ సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే ఎవరు.? వైసీపీ హయాంలో, ‘సకల శాఖల మంత్రి’గా తిరుగులేని ప్రోటోకాల్ దక్కించుకున్నారు. ఆయన అప్పట్లో ప్రభుత్వ సలహాదారు మాత్రమే.. కానీ, క్యాబినెట్ ర్యాంకు, ఆపై అదనపు సెక్యూరిటీ, బోల్డంత హంగామా.. వామ్మో, సలహాదారు అంటే, ఆ పదవి తాలూకు ‘డాబు’ ఇలా వుంటుందా.? అని మంత్రులే ముక్కున వేలేసుకునేంతలా ‘సజ్జల వెలుగులు’ చూశాం.
ఇంతా చేసి, రాష్ట్రానికి సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాల వల్ల ఒరిగిందేంటట.? ఏమో, ఆ విషయమై ప్రస్తుత టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం ఏమైనా విచారణ చేయిస్తే, సజ్జల సలహా సంగతేంటో తెలిసిపోతుంది. అది జరుగుతుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.
ఆ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, ఓటర్లు వైసీపీకి షాక్ ఇస్తే, ‘మా ఓటర్లు వేరే వున్నారు..’ అని సజ్జల సెలవిచ్చారు. ఏ విషయమ్మీద అయినా, ఆయా శాఖల మంత్రుల కంటే ముందుగా సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందనే కనిపించేది. ఆ సజ్జల రామకృష్ణా రెడ్డి వల్లనే వైసీపీ నిండా మునిగిపోయిందన్న ఆరోపణలు లేకపోలేదు.. అది మళ్ళీ వేరే చర్చ.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ‘మోసపోయాం.. ఈవీఎం ట్యాంపరింగ్..’ అంటూ కథలు చెబితే సరిపోదిక్కడ. 2019 ఎన్నికల్లో ఏ ఈవీఎంలతో వైసీపీ గెలిచిందో, అవే ఈవీఎంలలో ప్రజలు ఓట్లేస్తేనే, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి గెలిచింది.
ఇందులో ‘అనుమానాలు వున్నప్పటికీ..’ అంటూ సజ్జల సన్నాయి నొక్కులేంటి.? చింత చచ్చినా పులుపు చావలేదన్నది.. వెనకటికి పెద్దలు చెప్పేమాట.! అలాగే వుంది వైసీపీ పరిస్థితి. పదకొండు సీట్లు ఇచ్చి వైసీపీని జనం మూలన కూర్చోబెట్టినా, ‘అనుమానాలున్నాయ్’ అంటున్నారు. ‘ప్రజా తీర్పుగానే భావించాలి..’ అంటూ సన్నాయి నొక్కులొకటి.! వైసీపీ నేతలు భావిస్తే ఎంత.? భావించకపోతే ఎంత.?