మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్ లోని కోకాపేటలో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సెట్స్ అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాన్ని త్వరగానే పునరుద్దీకరించి అందులో షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా టాకి మొత్తం పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదల డేట్ ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని దసరా సందర్బంగా అంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల చేస్తారట. అక్టోబర్ 6నే దసరా పండగ ఉండడంతో ఆ నాలుగు రోజులు సినిమాకు కలసి వస్తాయనే ఆలోచనలో భాగంగా గాంధీ జయంతి రోజున విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదలకు ప్లాన్ చేసారు. మెగాస్టార్ తో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి,సుదీప్, జగపతి బాబు లాంటి మహామహుల్ని రంగంలోకి దింపారు. మొత్తానికి ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు.
అన్నట్టు ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్ అనుష్క ని ఎంపిక చేశారట. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారట. తొలితరం స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీస్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.