నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ తండేల్. పైగా సాయిపల్లవి హీరోయిన్ కావడంతో మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి జంటకు మంచి క్రేజ్ ఉంది. వాస్తవానికి సంక్రాంతికి వస్తారనుకుంటే చివరకు ఫిబ్రవరి 7వ తేదీకి విడుదల తేదీని మార్చేశారు. ఈ విడుదల తేదీకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ముందు స్టేజి మీద మూవీ టీమ్ మాట్లాడే ప్రోగ్రామ్ లో చైతూ, సాయిపల్లవి ఇద్దరూ మాట్లాడారు. మూవీ గురించి మాత్రమే ఇద్దరూ తమ వివరణ ఇచ్చుకున్నారు.
అయితే ఇలా మాట్లాడిన తర్వాత బజ్ కోసం మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా నిర్వహించారు. కానీ ఇందులో చైతూ, సాయిపల్లవి మాత్రం పాల్గొనలేదు. కేవలం అల్లు అరవింద్, బన్నీ వాసు, దర్శకుడు చందు మొండేటి మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. అసలైన హీరో, హీరోయిన్ ఎందుకు పాల్గొనలేదనే చర్చ జరిగింది. సాయిపల్లవిని, చైతూను మీరే పంపించేశారా అని అల్లు అరవింద్ ను అడగ్గా.. ఆయన నవ్వుతూ అవునని సమాధానం ఇచ్చారు. వారికి ఏవో పనులున్నాయంటూ కవర్ చేశారు.
కానీ అసలు కారణం వేరే ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వీరిద్దరూ కాంట్రవర్సీల్లో బాగా ఇరుక్కున్నారు. చైతూ శోభితతో ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ, సమంత మీద దారుణమైన కామెంట్లు చేయడం పెద్ద దుమారం రేపింది. అటు సాయిపల్లవి కూడా ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ మీద చేసిన వ్యాఖ్యలపై పెద్ద ట్రోలింగ్ నడిచింది. ఈ ఇద్దరినీ ఆ విషయాలపై మీడియా ప్రశ్నలు అడుగుతుందని ముందే ఊహించారు. వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి ఇబ్బంది పడేందుకు సిద్ధంగా లేరని.. అందుకే పాల్గొనలేదని తెలుస్తోంది.