‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కార్తికేయ, ఆ తర్వాత వరుసగా రెండు ఫెయిల్యూర్స్ చవిచూశాడు. తాజాగా ఈ హీరో నుంచి మరో కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని ‘ఆర్‌ఎక్స్100’ని నిర్మించిన నిర్మాణ సంస్థే రూపొందించనుంది. సినిమాకి సంబందించిన అనౌన్స్‌మెంట్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని విడుదల చేశారు.
ఓ పాల సీసా, ఆ పక్కనే లిక్కర్ బాటిల్.. ఓ చిన్న పిల్లాడి చెయ్యి కన్పిస్తున్నాయి ఈ పోస్టర్‌లో. పాల సీసాలో కూడా లిక్కర్‌నే నింపేశారు. అంటే, హీరో పుట్టినప్పటినుంచీ లిక్కర్‌తోనే వుంటాడని అనుకోవాలేమో. సినిమా కథేంటన్నది ఇప్పుడే అంచనా వేయలేంగానీ, ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా తరహాలో మరో ‘రా’ అండ్ ‘కల్ట్’ మూవీనే కార్తికేయతో ప్లాన్ చేశారనే విషయం అర్థమవుతోంది.
తొలి సినిమాని మించిన ‘రా’ అండ్ ‘కల్ట్’ థీమ్ రెండో సినిమా ‘హిప్పీ’లోనూ వున్నా, ఆడియన్స్ తిరస్కరించారు. కాస్త జాగ్రత్తపడి ‘గుణ 369’ సినిమా చేసినా కార్తికేయకు విజయాన్ని కట్టబెట్టలేదు ఆడియన్స్. మరి, ఈసారి కార్తికేయ ప్రయత్నం ఏమవుతుందో వేచి చూడాల్సిందే. అన్నట్టు, కార్తికేయ కొత్త సినిమా టైటిల్ ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతోంది.
9వ తేదీ తొమ్మిదవ నెల 19వ సంవత్సరం.. భలే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అనూప్ రుబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.