ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రుషికొండ మీద వైసీపీ హయాంలో నిర్మించిన ప్యాలెస్ భవన సముదాయాన్ని సందర్శించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, నిర్మించిన ఆ ప్యాలెస్ భవన సముదాయాన్ని స్టార్ హోటల్ ఛెయిన్‌కి ఇచ్చేస్తే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసంగా వుండేందుకుగాను, ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. సుమారు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ భవన నిర్మాణం కోసం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి.
‘అది పర్యాటక శాఖ కోసం నిర్మించాం’ అని ఇప్పుడు వైసీపీ చెబుతున్నా, అప్పట్లో సీఎం నివాసం కోసమే.. అని ఇదే వైసీపీ నేతలు చెప్పడం చూశాం. బాత్రూమ్ కమోడ్‌ని సైతం లక్షలు ఖర్చు చేసి విదేశాల నుంచి తీసుకొచ్చారు.. ఈ భవంతిలో పొందుపర్చారు. ఎందుకు.? అంత అవసరం ఏంటి.? అన్న ప్రశ్నలకి వైసీపీ దగ్గర సమాధానం లేదు.
సరే, అయ్యిందేదో అయిపోయింది.! ఖర్చయ్యింది ప్రజాధనం గనుక.. ఆ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వుంటుంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం.. ఇలా ఏదో ఒక అధికారిక కార్యాలయంగా దీన్ని ఉపయోగించాలన్న వాదనలున్నాయి.
మరోపక్క, అది అక్రమ నిర్మాణం కాబట్టి కూల్చేయాలన్న వాదనలూ లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వేదికను కూల్చేసినట్లు, కూటమి ప్రభుత్వం అంత పిచ్చి పని చేస్తుందని అనుకోలేం. కాకపోతే, 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యిందిక్కడ.
అంతకు ముందు పర్యాటక శాఖకి సంబంధించిన భవనాలే రుషికొండపై వుండేవి. సో, అత్యంత బాధ్యతాయుతంగా ప్రస్తుత ప్రభుత్వం, రుషికొండ ప్యాలెస్‌ని వినియోగించాల్సి వుంటుంది. అదే సమయంలో, నిర్వహణ ఖర్చులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన దరిమిలా, ఈ పాపానికి కారణమైన గత ప్రభుత్వంలోనివారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.