ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా బెట్టు వీడారు. అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. మంత్రి పదవి దక్కకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిన రోజా, చాలా తొందరగానే ‘కవరేజ్ ఏరియా’లోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకుంది. రోజా అంటే రాజకీయాల్లో రెబల్ స్టార్ కిందే లెక్క.
ఏ పార్టీలో వున్నా, ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలతో విరుచుకుపడటం ఆమె స్టయిల్. ఈ క్రమంలో ఒక్కోసారి సంయమనం కోల్పోతుంటారు. బూతులు కూడా తిట్టేస్తుంటారు. అదే, ఆమెకు మంత్రి పదవి రాకుండా చేసిందా? ఏమోగానీ, మంత్రి పదవి దక్కకపోవడం గురించి రోజాని ప్రశ్నిస్తే, ‘సామాజిక వర్గ సమీకరణాల కారణంగానే మంత్రి పదవి రాలేదేమో. పరిస్థితుల్ని నేను అర్థం చేసుకోగలను. అసంతృప్తి ఏమీ లేదు’ అని రోజా క్లారిటీ ఇచ్చేశారు. మరోపక్క, రోజాని బుజ్జగించే బాధ్యతను వైఎస్ జగన్, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు. దాంతో, విజయసాయిరెడ్డి స్వయంగా రోజాతో మాట్లాడేందుకు రెండు మూడు రోజులుగా ప్రయత్నించి, చివరికి విజయం సాధించినట్లే కన్పిస్తోంది. ‘మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ, భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయి’ అని విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్ మాటగా చెప్పేసరికి రోజా సర్దుకుపోయారట.
మంత్రి పదవి ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, చీఫ్ విప్ పదవి అయినా ఇవ్వొచ్చు కదా! అని రోజా, విజయసాయిరెడ్డికి సూటి ప్రశ్నే వేశారట. ‘రెండున్నరేళ్ళలో మెజార్టీ మంత్రులు మారిపోతారు. అప్పుడు కీలక పదవి దక్కుతుంది’ అని విజయసాయిరెడ్డి, జగన్ చెప్పిన మాటను పునరుద్ఘాటించారట. ‘అప్పుడైనా పదవి వస్తుందని ఎలా నమ్మేది.?’ అని రోజా తనదైన స్టయిల్లో ఎదురు ప్రశ్నించడంతో విజయసాయిరెడ్డి దగ్గర ఇంకో మాట లేకుండా పోయిందట. మరోపక్క, ఇంకా బెట్టు చేస్తే కష్టమనీ, సంపూర్ణ మెజార్టీతో వున్న పార్టీపై తిరుగుబాటు చేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన రోజా, తనను తాను సర్దిపుచ్చుకుని, విజయసాయిరెడ్డి సూచన మేరకు అజ్ఞాతం వీడారన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే, రోజాతో ఓ వైపు టీడీపీ శ్రేణులు, ఇంకో వైపు బీజేపీ శ్రేణులు టచ్‌లోకి వచ్చాయట గత రెండు మూడు రోజులుగా. ‘పార్టీ మారాల్సిందే.. జనసేన వైపుకు వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు’ అని కార్యకర్తలు సైతం, రోజాపై ఒత్తిడి తీసుకొచ్చారట. ఇంత కథ నడిచింది తెరవెనుకాల. చివరికి కథ సుఖాంతమయ్యింది. రోజా ఈజ్ బ్యాక్, అసెంబ్లీలో ఆమె తన సహజ సిద్ధమైన స్టయిల్లో ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా చెలరేగిపోతారా.? మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేదనతో సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తారా? వేచి చూడాల్సిందే.
Related Posts
జగన్ 2.0: రోజాకి ‘హోంమంత్రి’ పదవి దక్కేనా!
రోజాకు ఆ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టేనా ?