మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకుడు. జీవీ ప్రకాష్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీస్ నిర్మాణం. సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ కూడా బాగానే వుంది.
‘భీష్మ’ హిట్టుతో పెరిగిన నితిన్ రేంజ్, ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్‌తో కాస్త డోలాయమానంలో పడింది. కేతిక శర్మ చేసిన స్పెషల్ సాంగ్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో, వివాదాస్పదమయ్యింది కూడా. ‘అబ్బే, అందులో వల్గారిటీ ఏమీ లేదు’ అంటున్నాడు హీరో నితిన్.
ఇదంతా నాణేనికి ఓ వైపు. ఇంకో వైపే, ‘రాబిన్ హుడ్’ టీమ్, తమ సినిమాని తామే ఎందుకు అవమానించుకుంటున్నదీ ఎవరికీ అర్థం కావడంలేదు. అవమానించడం.. అనేది నిజానికి, పెద్ద మాటే.! సినిమాపై సహజంగానే చిత్ర యూనిట్‌కి పూర్తి నమ్మకం వుంటుంది, సినిమా హిట్టవుతుందనే నమ్మకాలూ వుంటాయ్. ఇదేమీ వింత కాదు.
కానీ, సినిమా చుట్టూ జరుగుతున్న పబ్లిసిటీలో వెటకారాలు ఎక్కువైపోయాయ్. చెప్పిన టైమ్‌కి కంటెంట్ విడుదల చేయకపోవడంపై నితిన్, దర్శకుడు ఓ ప్రమోషనల్ వీడియోలో సెటైర్లేసుకున్నారు. అది కాస్తా, సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యింది.
ట్రైలర్ రిలీజ్ కోసం వేరే ఏర్పాట్లు చేసుకుంటే, అనుమతుల దగ్గర ఇబ్బంది రావడంతో, దానికి వేరే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. సరే, ఇవన్నీ సినీ రంగంలో కామన్ అనుకోండి.. అది వేరే సంగతి.
ఎవరో తమ మీద సెటైర్లేయడం కంటే, ముందుగా తామే సెటైర్లు వేసేసుకుంటే మంచిదన్న తుత్తర ‘రాబిన్ హుడ్’ టీమ్‌లో కనిపిస్తోంది. సినిమాకి ఎలాగైనా పబ్లిసిటీ కావాలి. పాజిటివ్ పబ్లిసిటీ అయితేనేం, నెగెటివ్ పబ్లిసిటీ అయితేనేం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
కానీ, ప్రమోషనల్ వీడియోలతో చులకనైపోవడం ఎంతవరకు సబబు.? అది కూడా తమను తామే ర్యాగింగ్ చేసుకోవడం వల్ల ‘రాబిన్ హుడ్’ టీమ్ ఏం సంకేతాలు పంపుతోంది.? సినిమా హిట్టయితే, ఇదే ఫార్మాట్ మరికొన్ని సినిమాలు అనుసరించొచ్చు. లేదంటే మాత్రం, ఇదో గుణపాఠంలా మిగిలిపోతుంది.