అసలే కరోనా కాలం.. దేశంలో చాలామంది డబ్బు కోసం కటకటలాడుతున్నారు. చిన్నచిన్న ఉపాధి పొందేవారి పరిస్థితి అయితే మరీ దారుణం. ఐదు నెలలుగా చాలా మందికి ఆదాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా పెద్ద మొత్తంలో నగదు, నగలు దొరికితే ఏం చేస్తారు? చక్కగా ఇంటికి పట్టుకెళ్లిపోతారు. కానీ పుణెకు చెందిన విఠల్ మపారే మాత్రం వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించాడు.
రిక్షావాలా అయిన మపారేకి కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కనీసం అందులో ఏముందో కూడా చూడకుండా పోలీసులకు అప్పగించి తన గొప్ప మనసు చాటుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేశవ్ నగర్ ప్రాంతంలో మపారా రిక్షాలో ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు. హదప్సర్ బస్టాండ్ లో దిగిపోయారు. అయితే, వారి వెంట తెచ్చుకున్న బ్యాగు రిక్షాలో మరచిపోయి దిగిపోయారు. ‘నేను వారిని దింపేసిన తర్వాత అక్కడ నుంచి బీటీ కవాడే రోడ్డుకు వెళ్లి అక్కడ రిక్షా పార్క్ చేశాను. అప్పుడే అందులో బ్యాగ్ చూశాను. అందులో ఏముందో కూడా నేను చూడలేదు. వెంటనే తీసుకెళ్లి ఘోర్పడి చౌకి పోలీస్ స్టేషన్ లో అప్పగించాను’ అని మపారా తెలిపారు.
‘ప్రొసీజర్ ప్రకారం మేం ఆ బ్యాగ్ తెరిచి చూశాం. అందులో 11 బంగారు నగలు, రూ.20వేల నగదు ఉన్నాయి. మొత్తం వాటి విలువ రూ.7 లక్షల వరకు ఉంటుంది. వెంటనే ఈ విషయాన్ని హదస్పర్ పోలీస్ స్టేషన్ కు తెలియజేశాం. అప్పటికే అక్కడ ఓ జంట తమ బ్యాగ్ పోయిందని కంప్లయింట్ ఇచ్చారు. దీంతో ఆ బ్యాగును సదరు జంటకు అప్పగించాం. మపారే నిజాయతీకి మెచ్చి పుణె డిప్యూటీ కమిషనర్ సుహాస్ బవాచే ఆయన్ను సత్కరించారు’ అని ఎస్ ఐ విజయ కదం వివరించారు. ఈ విషయంలో మీడియాలో ప్రముఖంగా రావడంతో మపారే నిజాయతీని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.