కిలారి ఆనంద్ పాల్‌ని రామ్ గోపాల్ వర్మతో పోల్చగలమా.? ఎందుకు పోల్చకూడదు.? ఇద్దరూ ఆయా రంగాల్లో ఉద్దండులే. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ‘శివ’ వంటి గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు. కెఎ పాల్, క్రైస్తవ మత ప్రబోధకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుడు. వర్మతో సినిమాలు చేయడానికి హీరోలు, హీరోయిన్లు వెంపర్లాడేవారు. కెఎ పాల్ ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా పోటీ పడేవారు. ఈ ఇద్దరూ ఇప్పుడు వార్తల్లోకెక్కారు.
వర్మ తాను తెరకెక్కిస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో, కెఎ పాల్ మీద ఓ పాట పెట్టాడు మరి. ఇటీవలి ఎన్నికల సమయంలో పాల్ – వర్మ మధ్య ఓ వివాదం నడిచింది. దాన్ని గుర్తుపెట్టుకుని వర్మ, తన క్రియేటివిటీని ఉపయోగించి సినిమాలో పాటగా మలిచాడు. పాల్ వెకిలి చేష్టల్ని ఆ పాటలో వర్మ తనదైన స్టయిల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పాల్ వెకిలి చేష్టలు చూపించడం సంగతి సరే.. వర్మ వెకిలితనం సంగతేంటి.?
పాల్‌లో కొందరు రామ్‌గోపాల్ వర్మని చూస్తున్నారు. ‘ఇద్దరికీ పెద్దగా తేడా ఏం లేదు..’ అనే కామెంట్స్, వర్మ పోస్ట్ చేసిన తాజా సాంగ్ తాలూకు ట్వీట్ కిందనే దర్శనమిస్తున్నాయి. అన్నట్టు, వర్మ ఓ అభిమానిని ఉద్దేశించి, ‘ఇంటలెక్చువల్స్ అని చెప్పుకుంటున్నవారికి మీకున్న తెలివిలో ఒక్క శాతం కూడా లేదు..’ అని వర్మ సెలవిచ్చేశాడండోయ్ ట్విట్టర్ వేదికగా. అంతా ఆ వ్యక్తిని వర్మగారు పొగిడేయడానికి కారణం, సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే చూడాలని సదరు వ్యక్తి చెప్పడమే.
అవును, సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్‌గా మాత్రమే చూడాలి.. కానీ, వర్మ తన ‘దురద’ తీర్చుకోవడానికి సినిమాలు తీస్తే, వాటిని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీలవ్వాలని ఆశించడాన్ని ఏమనుకోవాలట.?
