ఏపీ పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆర్జీవీ పారిపోయాడని.. అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయాడని రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. నేనేదో వణికిపోతున్నానని.. మంచం కింద కూర్చుని ఏడుస్తున్నానంటూ రాసే మీడియా సంస్థలకు ఈ వీడియో డిసప్పాయింట్ గా ఉండొచ్చు అన్నారు. నేనేదో ఏడాది కింద చేసిన ట్వీట్స్ కు నాలుగు వేర్వేరు చోట్ల మూడు రోజుల వ్యవధిలోనే నలుగురి మనోభావాలు ఎలా తిన్నాయని ప్రశ్నించారు.
అసలు నేను చేసిన ట్వీట్స్ కు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే వాళ్లు నాపై కేసుల పెట్టడం ఏంటి.. అసలు ఆ సెక్షన్లు ఈ కేసులో ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ఏడాది తర్వాత ఆ కేసులను ఇప్పుడు బయటకు తీయడం ఏంటని అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాజకీయ నాయకులు ఇలాంటివి చేస్తున్నారని.. అమెరికా, యూరప్ లో ఇదే జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరుగుతున్నట్టు వివరించారు. పోలీసులు నిజాయితీగా ఉన్నా కూడా.. పైన వారి ఒత్తిడితో ఇలా జరుగుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ డేరింగ్ ఉన్నోడని కొందరు.. ఈ చెప్పడం ఏదో విచారణకు వెళ్లి చెప్పొచ్చు కదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.