ఎప్పుడో ఏడాది క్రితం నేనేదో ట్వీట్ చేస్తే, అదిప్పుడు నాలుగు చోట్ల నలుగురు వ్యక్తులకు ఒకేసారి మనోభావాల్ని దెబ్బ తీయడమేంటి.? అంటూ, ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ లేవనెత్తాడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఫిలిం మేకర్ రామ్ గోపాల్ వర్మ.
అంటే, ఏడాది క్రితం హత్య చేశాను కాబట్టి, ఇప్పుడెవరూ తన మీద కేసు పెట్టొద్దని కరడు గట్టిన నేరస్తుడు బుకాయించినట్లుంది పరిస్థితి.!
హత్యా నేరాన్నీ, ట్వీటునీ ఒకేలా చూడటం ఎంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. చిన్నదైనా, పెద్దదైనా.. అది నేరమే.! కాకపోతే, శిక్ష పెద్దదా.? చిన్నదా.? అన్న తేడా మాత్రమే వుంటుంది.
ఎవరి గురించో ట్వీటేస్తే, ఇంకెవరి మనోభావాలో దెబ్బ తింటే.. మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడితే, అలాంటి కేసులు నిలబడతాయా.? నిలబడవా.? అని రామ్ గోపాల్ వర్మ తన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌లో ఇంకే పాయింటుని లేవనెత్తాడు.
వైసీపీ హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసేందుకు రామ్ గోపాల్ వర్మ ఏ ఉద్దేశ్యంతో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సినిమాలు తీసినట్లు.? తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా.. బోల్డన్ని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ఎందుకు పోస్ట్ చేసినట్లు.?
‘మేం చేస్తేనే అది సంసారం.. ఇంకెవడన్నా చేస్తే అది వ్యభిచారమే..’ అన్నట్లుంటుంది ఆర్జీవీ వ్యవహారం.! మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల నేపథ్యంలో వైసీపీ హయాంలో బోల్డన్ని కేసులు నమోదయ్యాయి, అరెస్టులు జరిగాయి. కస్టోడియల్ టార్చర్స్ గురించి కూడా విన్నాం. ఇవన్నీ ఆర్జీవీకి తెలియవా.?
వైసీపీ హయాంలో అవన్నీ ఆర్జీవీకి సమ్మగా అనిపించాయ్. ఎందుకంటే, వైసీపీకి ఆర్జీవీ సానుభూతిపరుడు గనుక. ఆ వైసీపీ కోసమే అప్పట్లో ఆయన పనిచేశాడు గనుక. సరిగ్గా ఎన్నికలకు ముందర పరిస్థితి అర్థమయి, ‘ఇకపై రాజకీయాలు మాట్లాడబోను’ అని ప్రకటించేశాడు ఆర్జీవీ.
అన్నట్టు, గత కొద్ది రోజులుగా, ఆర్జీవీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చాలా ట్వీట్లు మాయమయ్యాయ్. ఆ ట్వీట్ల నేపథ్యంలోనే కేసులు నమోదయిన దరిమిలా, భయపడి ఆర్జీవీ ఆ ట్వీట్లను తొలగించాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి, భయంతో అజ్ఞాతంలోకి పారిపోయాడు.
కానీ, ‘నేనెవరికీ భయపడటంలేదు..’ అంటూ ఓ వీడియో విడుదల చేసి, అందులో పైన పేర్కొన్న ‘లా పాయింట్లు’ అన్నీ లాగేశాడు. పోలీసులు విచారణకు పిలిచారు, హాజరై.. వివరణ ఇవ్వాల్సింది పోయి.. భయంతో ఎక్కడో దాక్కుని, వీడియోలు విడుదల చేయడమేంటి.? పైగా, భయం లేదని అనడమేంటి.?
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.! ఆర్జీవీ ట్వీట్ చేసిన ప్రతి మార్ఫింగ్ ఫొటో, మార్ఫింగ్ వీడియోకీ ఆయన సమాధానం చెప్పుకుని తీరాల్సిందే. తొందరపడితే ఎలా.! దాక్కుని తిరుగుతున్నాడు గనుక, కాస్త ఆలస్యమవుతోందంతే.. కానీ, ఆర్జీవీ తగిన మూల్యం చెల్లించుకోవాలి.!
ఏం ఆర్జీవీకి మాత్రమే చేతనవుతుందా మార్ఫింగ్ ఫొటోల్ని, వీడియోల్ని షేర్ చేయడం.? ఆర్జీవీకి మాత్రమే చేతనవుతుందా.. నచ్చని రాజకీయ నాయకుల మీద అభ్యంతకరమైన రీతిలో సినిమాలు తీయడం.? చాలామందికి విజ్ఞత అనేది వుంటుంది. ఆర్జీవీకి అది వుండదు.. అంతే తేడా.!