ఆర్జీవీ చట్టానికి తలొగ్గారు. ఇన్ని రోజులు విచారణకు రాకుండా తిరిగిన ఆయన.. చివరకు పోలీసుల ముందుకు వచ్చారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆయన శుక్రవారం విచారణకు వచ్చారు. ఏపీ ఎన్నికలకు ముందు ఆయన వ్యూహం సినిమాను తీశారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా పెట్టిన పోస్టు పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను కించపరిచే విధంగా ఆ పోస్టు ఉండటంతో అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మద్దిపాటు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఒంగోలు రూరల్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే కేసు విచారణకు రావాలంటూ పలుమార్లు పోలీసులు నోటీసులు కూడా పంపించారు. కానీ ఆర్జీవీ మాత్రం తప్పించుకుని తిరిగారు. మొన్నటి దాకా అజ్ఞాతంలో ఉన్నారు. వాట్సాప్ ద్వారా హాజరవుతానంటూ చెప్పారు. తమ పర్మిషన్ లేకుండా విచారణకు రాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాంతో తన మీద పెట్టిన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు ఆర్జీవీ.
వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. విచారణకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశించింది. చివరకు ఆర్జీవీ చేసేది లేక చట్టానికి తలొగ్గి నేడు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.