వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణిల మీద ఓ పోస్టు పెట్టాడు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు బుక్ చేశారు. ఈ క్రమంలోనే ఆర్జీవీ మీద ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులో పోలీస్ కేసు నమోదైంది. ఐటీ చట్టం కింద ఆయన మీద కేసులు పెట్టారు. మరి ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఆర్జీవీ స్పందించలేదు. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ కోరిన విషయం తెలిసిందే. దాంతో సీఎం చంద్రబాబు కూడా అలెర్ట్ అయ్యారు.
మహిళలు, చిన్న పిల్లలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఆ క్రమంలోనే కేసులు నమోదవుతున్నాయి. మరి ఆర్జీవీ దీన్ని ఎలా ఎదుర్కుంటారో చూడాలి.