శతకోటి సమస్యలకు అనంత కోటి ఉపాయాలు అన్న చందంగా.. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకం కావాలి కానీ, పనులు ఎలాగైనా చేజిక్కించుకోవచ్చు. మామూలు టెండర్లు అయినా.. రివర్స్ విధానమైనా ఎంచక్కా అన్నీ చేజిక్కించుకోవచ్చు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సర్కారు పిలిచిన టెండర్లను సమీక్షిస్తూ.. రివర్స్ టెండర్లను పిలుస్తున్న సంగతి తెలిసిందే.
తొలుత పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకే దీనిని పరిమితం చేసినా.. తర్వాత అన్ని పనులకూ ఇదే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లీలతో తయారుచేసే పట్టీ) టెండర్లలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రివర్స్ విధానంలో ఈ టెండర్లను పిలిచినప్పటికీ రూ.14 కోట్ల అదనపు భారం పడింది.
అక్షయపాత్రతో పాటు మరో సంస్థ తక్కువ ధరకే చిక్కీలను సరఫరా చేస్తామని పేర్కొన్నప్పటికీ పట్టించుకోకుండా అధిక ధర కోట్ చేసిన సంస్థకే వాటిని కట్టబెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. తొలుత ఇందుకోసం జూలైలో టెండర్లు పిలిచారు. కానీ అంతగా స్పందన రాకపోవడంతో మళ్లీ ఆగస్టులో పిలిచారు. కిలో చిక్కీ సరఫరాకు రూ.135 ధర ఖరారు చేశారు.
అయితే, దీనికంటే 10 శాతం ఎక్సెస్ కు కోట్ చేసిన సంస్థకు టెండర్ ఖరారు చేశారు. వాస్తవానికి అక్షయపాత్రతోపాటు ఇతర మధ్యాహ్న భోజన సంస్థలకు రూ.135 మాత్రమే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో తాము రూ.120కే వాటిని సరఫరా చేస్తామని ఓ సంస్థ లేఖ ఇచ్చినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి చిక్కీల సరఫరా కోసం టెండర్లు పిలిచారు.
అన్ని చోట్లా రూ.142.50 నుంచి రూ.149.20 మధ్య ధరలు ఖరారు చేశారు. తాము నిబంధనల మేరకే టెండర్లు ఖరారు చేశామని అధికారులు చెబుతున్నా.. తక్కువ ధరకే సరఫరా చేస్తామని ముందుకొచ్చిన సంస్థలను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. టెండర్ నిబంధనల్లో చేసిన మార్పుల వల్లే ఆయా సంస్థలు అర్హత కోల్పోయాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.