తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, చేప నూనె, పామాయిల్ వాడినట్లు నిర్ధారణ అయిందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ల్యాబ్స్ లో పరీక్షలు నిర్వహించగా సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలిపింది. ఇదే విషయమై టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి సైతం మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ప్రసాదంలో వాడిన నెయ్యిని పరీక్షించగా.. సోయాబీన్, పొద్దు తిరుగుడు నూనె, చేప నూనె, ఎద్దు మాంసపు కొవ్వు, బీఫ్ టాలో, పామాయిల్ నెయ్యిలో కలిపినట్లు నిర్ధారించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన రిపోర్టులను సైతం ఆయన మీడియా ముందు ఉంచారు.
గత ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై తన వద్దకు చాలా ఫిర్యాదులు వచ్చాయని త్వరలోనే ఆ సమస్యకు చెక్ పెడతామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో లడ్డు నాణ్యత పై చాలా ఫిర్యాదులే అందాయి. దీనిపై సురేంద్రరెడ్డి కమిటీ రిపోర్టు కూడా ఇచ్చింది. ప్రసాదానికి వాడే నెయ్యిలో నాణ్యత లేదని ఆ కమిటీ తేల్చింది. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన డీలర్లను బ్లాక్లిస్టులో పెట్టినట్టు అప్పట్లో టీటీడీ తెలిపింది. ఇప్పుడు ఏకంగా జంతువుల కొవ్వే నెయ్యిలో కలిసిందన్న విషయం ఆందోళన కలిగిస్తోంది.