Renu Desai: నెటిజన్లు తనపై చేస్తున్న కామెంట్లపై అసహనం వ్యక్తం చేసారు. తనను దురదృష్టవంతురాలని పిలవడం బాధిస్తోందని.. అలా పిలవొద్దని ఎంత చెప్పినా వినటంలేదని రేణూ దేశాయ్ (Renu Desai) ఆవేదన చెందారు. ఇటివలి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఘన విజయం సాధించడం.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఈక్రమంలో ఓ నెటిజన్ ఆమెను.. ‘మీరు దురదృష్టవంతురాలు మేడమ్’ అంటే కాస్తంత వ్యంగ్యంగా అన్నాడు. దీనిపూ రేణు దేశాయ్ స్పందిస్తూ.. ‘నేనెలా దురదృష్టవంతురాలినో చెప్పగలరా..? మీ సమాధానం కోసం ఎదురు చూస్తూంటా’నని రిప్లై ఇచ్చారు. ఈమేరకు వచ్చిన స్క్రీన్ షాట్స్ పంచుకున్నారు. వాటిని వివరిస్తూ..
‘దురదృష్టవంతురాలు అనే మాట నన్ను బాధిస్తోంది. కొన్నేళ్లుగా ఇదే మాట అంటున్నారు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు అయిపోరు. ఇది తెలుసుకోకుండా.. దురదృష్టవంతురాలనే మాటలు విసుగు పుట్టిస్తున్నాయి. నా అదృష్టాన్ని కేవలం ఓ వ్యక్తితో ఎలా పోలుస్తారు. ఇప్పటివరకూ నాకు దక్కిన ప్రతి అంశంపై నేను సంతోషంగా ఉన్నాను. లేనివాటి గురించి ఎప్పుడూ ఆలోచించలే’దని రేణూ అన్నారు.