తెలుగు తెరపై రాముడంటే, శ్రీకృష్ణుడంటే స్వర్గీయ ఎన్టీయార్ గుర్తుకు రావడం సహజం. మరి, సత్యభామ అంటే.? సీనియర్ నటి జమున గుర్తుకొస్తారు. సినీ సత్యభామగా ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని గుర్తింపు వుంది. ఆ సినీ సత్యభామ ఇక లేరు.
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాదపడుతున్న జమున (86) హైద్రాబాద్‌లో తుది శ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లోనూ జమున నటించారు. జమున ఆగస్ట్ 30, 1936న హంపీలో జన్మించారు. ఆమె తండ్రి నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి.
జమున అసలు పేరు జానాబాయి. గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో విద్యనభ్యసించిన జమున, తన తల్లి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. హార్మోనియం వాయించడం కూడా తెలసామెకు. ‘ఖిల్జీరాజు పతనం’ నాటకంలోని ఓ పాత్రకు సీనియర్ నటుడు జగ్గయ్య ఆమె పేరుని ప్రతిపాదించారు.
‘మా భూమి’ నాటకంతో ఆమెకు తొలిసారిగా సినీ అవకాశం దక్కింది. డాక్టర్ గరికపాటి రాజారావు ఆమెకు తొలి సినీ అవకాశం ఇచ్చారు. జమున తొలిసారి వెండితెరపై కనిపించిన సినిమా పుట్టిల్లు’. ఎక్కువగా గడుసైన పాత్రలు ఆమె తెరపై పోషించేవారు.
తెలుగు తెరపై అప్పటి అగ్ర కథానాయకులందరితోనూ నటించి మెప్పించారు జమున. ఎస్వీ రంగారావు, నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.. ఇలా ఎవరి సరసన ఆమె నటించినా, తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జమున.
1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమండ్రి నుంచి ఆమె లోక్ సభకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోనూ జమున సత్యభామలానే వుండేవారు. పదునైన రాజకీయ విమర్శలూ చేసేవారామె. అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా ఎన్నికల ప్రచారంలో జమునని చూసేందుకు జనం పోటెత్తేవారు.
వృద్ధాప్య సమస్యలతో సినిమాల్లో నటించడం మానేసినా, సినీ వేదికలపై తరచూ కనిపిస్తుండేవారు. సీనియర్ నటి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.