పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ ఎందుకు విరుచుకుపడుతుంటుంది.? అర్థం పర్థం లేని విమర్శలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్‌ని ‘డీ-గ్రేడ్’ చేసే ప్రయత్నంలో వైసీపీ తన స్థాయిని ఎందుకు ప్రతిసారీ దిగజార్చుకుంటోంది.?
మంత్రులు తమ శాఖల వ్యవహారాల్ని పూర్తిగా పక్కన పడేసి, కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టే శాఖకి మాత్రమే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.? సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వడం మానేసి, జనసేన అధినేతపై మండిపడుతున్నారెందుకు.?
అన్నటికీ ఒకటే సమాధానం.! అదే అసహనం. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేసిందట. కానీ, చివరి నిమిషంలో ఆ ఆలోచలన్ని విరమించుకుందట. అప్పట్లో ఓ వైసీపీ ఎంపీ, తాము జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు చెబితే, ఆయన మీద వైసీపీ నేతలంతా మూకుమ్మడి మాటల దాడి చేశారు. ఆయన్ని ‘మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిగా’ పేర్కొన్నారు.
స్వయానా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే, జనసేన అధినేతతో పొత్తుల చర్చల కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాన్ని నాగబాబు కూడా ఓ సారి చెప్పుకొచ్చారు. ‘మేమెందుకు జనసేన దగ్గరకు వెళతాం.?’ అంటూ వైసీపీ బుకాయించింది.
కానీ, తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు.. తాము జనసేనతో పొత్తుల చర్చలు జరిపిన మాట వాస్తవమేనని ఒప్పేసుకున్నారు. ఆఫ్ ది రికార్డుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాననుకున్నారుగానీ, ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చేసింది. ‘కెమెరాల్లో ఎవరూ షూట్ చేయట్లేదు కదా.?’ అని అడిగి మరీ, అసలు విషయం చెప్పేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.
చీదరేయడంలేదూ.. ఇలాంటి రాజకీయాల్ని చూస్తే.? అప్పుడు అవసరార్ధం కాళ్ళ బేరానికి వెళ్ళి, ఇప్పుడేమో జనసేన మీద పనిగట్టుకుని విమర్శలు చేయడమా.? ఈ మాత్రందానికి సింహం.. సింగిల్‌గా రావడమొకటి.!
టీడీపీతో కలిసే పవన్ కళ్యాణ్.. తమతో కలిసేందుకు ఎందుకు సుముఖత చూపలేదు.? తమతో కలవలేదు సరికదా, ఇప్పుడు మళ్ళీ టీడీపీ వెనుక వెళతాడేమోనన్న భయంలోంచి పుట్టుకొస్తున్న అసహనం.. ఈ క్రమంలోనే వ్యక్తిగత హననం.!