రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! నిన్నటిదాకా పొగడటం, నేడు తెగడటం.. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ చూస్తున్నవే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనకాలే ఇన్నాళ్ళూ తిరిగిన విజయ సాయి రెడ్డి, ఇప్పుడు ఆయన్ని కాదని, వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.
అసలు విజయ సాయి రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది.? అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అప్పటినుంచే, విజయ సాయి రెడ్డి పేరు తెలుగునాట రాజకీయాల్లో మార్మోగడం మొదలైంది.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఎ1 నిందితుడైతే, విజయ సాయి రెడ్డి ఏ2 నిందితుడు. ఆడిటర్.. చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయ సాయి రెడ్డి, వైసీపీలో కీలక నేత అవడానికి అసలు సిసలు క్వాలిఫికేషన్ ‘ఏ2’. ఔను, ఏ2 గనుక అప్రూవర్ అయితే, ఏ1 పరిస్థితి అగమ్య గోచరం.
అందుకే, విజయ సాయి రెడ్డికి వైసీపీలో కీలక పదవులు ఇచ్చి గౌరవించుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎన్నికలకు ముందరే విజయ సాయి రెడ్డి అప్రూవర్ అవుతారని అంతా అనుకున్నారుగానీ, కుదరలేదు.
ఇప్పుడు అప్రూవర్‌గా మారే దిశగా విజయ సాయి రెడ్డి అడుగులు వేస్తున్నారా.? అంటే, అవుననే అనుకోవాలేమో.! ఈ క్రమంలో విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మీద, ట్వీట్ల యుద్ధం మొదలు పెట్టారు.
విజయ సాయి రెడ్డి తాజా ట్వీట్ ఏంటంటే.. ‘‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే!’’ అని.
సో, అర్థమయ్యింది కదా, విజయ సాయి రెడ్డి ఏం చెప్పదలచుకున్నారన్నది. కామెడీ ఏంటంటే, మొన్నటిదాకా విజయ సాయి రెడ్డి కూడా ఆ కోటరీలోని వ్యక్తే. విశాఖ మొత్తాన్నీ తన కబంధ హస్తాల్లో విజయ సాయి రెడ్డి బంధించేసుకున్నారనే మాట, విశాఖలో ఎవర్ని అడిగినా చెబుతారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా విజయ సాయి రెడ్డి కనుసన్నల్లోనే వుండేది. అసలు వైసీపీ మొత్తం విజయ సాయి రెడ్డి చేతుల్లోనే వుండేది ఒకప్పుడు. జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా కలవాలంటే, విజయసాయి రెడ్డితోనే సాధ్యమయ్యేది.
కానీ కోటరీలో కుమ్ములాటల కారణంగా, విజయ సాయి రెడ్డి తొక్కివేయబడ్డారు.. ఇప్పుడక్కడ అంతా సజ్జల రామకృష్ణా రెడ్డి హవా నడుస్తోంది. రేప్పొద్దున్న వైవీ సుబ్బారెడ్డి చేతుల్లోకి ఆ కోటరీ వెళ్ళొచ్చు. లేదంటే, మరో రెడ్డి ఆ కోటరీని తన వశం చేసుకోవచ్చు.
ఇక, కోటలోని రాజు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మంచిది. ముఖ్యమంత్రిగా వున్నప్పుడే, తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్జీకే పరిమితమయ్యారనే విమర్శల్ని ఎదుర్కొన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగా బెంగళూరులో అదే పని చేస్తున్నారాయన.
అప్రూవర్ అవ్వాలనుకుంటే, అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడైన విజయ సాయి రెడ్డి, నేరుగా కోర్టుకు వెళ్ళి.. చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. ట్విట్టర్ వేదికగా బోడి సలహాలు, గత యజమానికి ఇచ్చుకోవాలనుకుంటే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు.
విజయ సాయి రెడ్డి ట్వీట్లకి వైసీపీ నుంచి ఎలాగూ చీవాట్లు తప్పవు. వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు కూడా విజయ సాయి రెడ్డి మీద జాలి ప్రదర్శించే అవకాశం లేదు. అన్నట్టు, ఒకప్పుడు విజయ సాయి రెడ్డి పెంపుడు గ్రామ సింహాల్లా వ్యవహరించిన ఓ వర్గం కుల మీడియా సైతం, ఇప్పుడాయన్ని తిట్టిపోస్తోంది. నీ కష్టం పగడవాడిక్కూడా రాకూడదు విసారె.! చేసుకున్నోడికి చేసుకున్నంత.