వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు, విజయ సాయి రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. ఇద్దరూ కలిసి జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడి, ఇంకెవరూ అటు వైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారనీ, ఎవరైనా జగన్‌ని కలవాలంటే, ఈ కోటరినీ దాటుకుని వెళ్ళడం అసాధ్యమనీ, ఆర్థిక వ్యవహారాలేమైనా నడిపితేనే, జగన్ వద్దకు పంపిస్తున్నారనీ విజయ సాయి రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ మొత్తం వ్యవహారంలో, విజయ సాయి రెడ్డి ‘మనసు విరిగిపోవడం’ అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే, సజ్జల రామకృష్ణా రెడ్డి కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయ సాయి రెడ్డే ఎక్కువ. వైసీపీ సోషల్ మీడియా విభాగం, విజయ సాయి రెడ్డి కనుసన్నల్లో పని చేసినంతకాలం, వైసీపీకి తిరుగుండేది కాదు.
ఎప్పుడైతే, సజ్జల భార్గవ రెడ్డి (సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు) ఎంట్రీ ఇచ్చాడో ఆ తర్వాత కథ మారిపోయింది.
వైసీపీ అధికారం కోల్పోయాక, విజయ సాయి రెడ్డి మీద ‘అక్రమ సంబంధం’ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శాంతి అనే ఓ మహిళా అధికారితో విజయ సాయిరెడ్డికి అక్రమ సంబంధమంటూ, సదరు మహిళా అధికారి భర్త మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారానికి తెరవెనుకాల కథ నడిపిందీ, విజయ సాయి రెడ్డిని వివాదాల్లోకి లాగిందీ సజ్జల రామకృష్ణా రెడ్డేనంటూ అప్పట్లోనే ఊహాగానాలు వినిపించాయి. ఆ వ్యవహారంలో తనను కాపాడాల్సిన వైసీపీ అధినాయకత్వం, తనను పట్టించుకోలేదని విజయ సాయి రెడ్డి తన సన్నిహితుల వద్ద అప్పట్లోనే వాపోయారట.
అనూహ్యంగా ఆ కేసు వ్యవహారం కాలగర్భంలో కలిసిపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
విజయ సాయి రెడ్డి తాజాగా మీడియా ముందుకొచ్చి చేసిన ‘మనసు విరిగిపోయింది’ వ్యాఖ్యల తర్వాత, వైసీపీలో ఆయన నియమించిన సోషల్ మీడియా కార్యకర్తలంతా, ఇప్పుడు ఆయనకే మద్దతిస్తున్నారు.. వైసీపీని తప్పు పడుతున్నారు కూడా.
‘ఇప్పటికైనా మారు జగనన్నా.. లేకపోతే, వైసీపీకి మేం దూరమవ్వాల్సి వస్తుంది..’ అంటూ హెచ్చరిస్తున్నారు కూడా. షరామామూలుగానే అలాంటివారిపై కోవర్టు ముద్ర వేస్తున్నారు వైసీపీలో సజ్జల సోషల్ మీడియా టీమ్.
ఎవరైనా జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళ ఇళ్ళల్లోని ఆడవాళ్ళపై జుగుప్సాకరమైన కామెంట్లు చేసే సజ్జల సోషల్ మీడియా టీమ్, ఇకపై విజయ సాయి రెడ్డిని కూడా అదే రీతిలో సన్మానించేందుకు సిద్ధమవుతోందిట.
అన్నట్టు, ఏ2 విజయ సాయి రెడ్డికి నిజంగానే మనసు విరిగిపోతే, అక్రమాస్తుల కేసులో అప్రూవర్‌గా మారిపోతే, ఏ1 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటట.? ఇదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడు కాబట్టే, విజయ సాయి రెడ్డికి వైసీపీలో కీలక పదవులు ఇచ్చి సత్కరించారు వైఎస్ జగన్. అది గతం. ఇప్పుడు ఏ ధైర్యంతో విజయ సాయి రెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూరం చేసుకున్నట్టు.? ఇది కూడా మిలియన్ డాలర్ క్వశ్చనే.