‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి సెంటైర్లు ఎందుకు పడుతున్నాయ్.! పడతాయ్ మరి.!
నువ్వు నేర్పిన విద్యయే కదా.. అన్న చందాన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూటమి పార్టీల నుంచి ‘పోటు’ మామూలుగా లేదు.! అలాంటిలాంటి పోటు కాదిది.!
వైసీపీ అధికారంలో వున్నప్పుడు పదే పదే ‘ఇరవై మూడు’ అనే సంఖ్య చుట్టూ ఆ పార్టీ నాయకులు సెటైర్లు వేయడం చూశాం. ‘ఇది దేవుడి స్క్రిప్ట్’ అంటూ, 23వ నంబర్ గురించి ప్రస్తావిస్తూ చట్ట సభల్లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సెటైర్లు వేశారు.
ఎక్కడ, ఏ సందర్భం వచ్చినా, ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ 23వ నంబర్‌కి వైసీపీ లింక్ చేస్తూ వచ్చేది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిన అరెస్టుల విషయంలోనూ ఈ నెంబర్‌ని వైసీపీ అప్పట్లో ఫాలో అయ్యిందన్న విమర్శలున్నాయి.
కట్ చేస్తే, వైసీపీకీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయ్. తమకు 23 సీట్లు వచ్చినప్పుడు వైసీపీ తమను ‘23’ గురించి ప్రస్తావిస్తూ సెటైర్లు వేసింది గనుక, తామూ ‘పదకొండు’ చుట్టూ సెటైర్లేస్తామని టీడీపీ అనుకుంటే, అందులో వింతేముంది.?
మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే క్రమంలో ‘మూడు’ నంబర్ చుట్టూ వెటకారాలు చేసేది వైసీపీ. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించే ఈ సెటైర్ల పరంపర. మరి, జనసేన ఊరుకుంటుందా.? జనసేన కూడా పదకొండో నెంబర్‌తో సెటైర్లేస్తుంది.
నిన్న శాసన సభ్యుల సాంస్కృతిక ప్రదర్శనల్లో ఓ సెటైరికల్ కామెడీ స్కిట్ సందర్భంగా, పదకొండో నెంబర్.. ప్రస్తావనకు వచ్చింది. అంతే, వైసీపీ నానా యాగీ షురూ చేసింది సోషల్ మీడియా వేదికగా. టీడీపీ, జనసేన ఊరుకుంటాయా.? గతంలో మూడు, ఇరవై మూడు.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ సంబంధిత వీడియోల్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు.
అన్నట్టు, వైసీపీ సిద్ధం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మల్ని పెట్టి, వాటిని కాళ్ళతో తన్నించే ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోల్నీ టీడీపీ, జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, వైసీపీకి కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి.
మిగతా విషయాలెలా వున్నా, పదకొండో నెంబర్ చుట్టూ జరుగుతున్న విమర్శల, సెటైర్ల పరంపరని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. చేసుకున్నోడికి చేసుకున్నంత.. అంటే ఇదే మరి.!