ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. అదే తేడా.!
అమరావతిని రాజధానిగా గతంలో నిర్ణయిస్తే, వైసీపీ హయాంలో ఆ రాజధానిలో కొత్తగా ఒక్క ఇటుక కూడా పెట్టిన పాపాన పోలేదు. దాంతో, రాజధాని వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చి, దాదాపు ఏడాది గడుస్తున్నా, రాజధాని అమరావతికి సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి.
అదే, 2019లోనూ చంద్రబాబే అధికారంలోకి వచ్చి వుంటే, రాజధాని అమరావతి ప్రస్తుతం వేరే లెవల్‌లో వుండేది. హైద్రాాబాద్ స్థాయిలో.. అనడం సబబు కాదుగానీ, ఓ మోస్తరుగా అమరావతి నగరం అనేది రూపు దిద్దుకుని వుండేది, 2019లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రి అయి వుంటే.
నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే, పదిహేనేళ్ళపాటు స్థిరమైన ప్రభుత్వం వుండాలి. ప్రభుత్వ లక్ష్యం కూడా ఒకటే అయి వుండాలి. అధికారంలో వున్నవారు మారినాసరే, రాష్ట్ర అభివృద్ధి విషయమై ఒకే రకమైన ఆలోచన వుండి వుండాలి.
వైసీపీకి అలాంటి ఆలోచన లేకపోవడం వల్ల రాష్ట్రం, ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. అమరావతిలో పనుల్ని వైసీపీ ఆపేయడం వల్ల, అంతకు ముందు మొదలైన పనుల్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి, చంద్రబాబుకే ఇంత సమయం పట్టింది మరి.!
ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘పదిహేనేళ్ళపాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వుండాలి’ అని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే పరమావధి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
‘మేం అధికారంలోకి వస్తే..’ అని, 2019 ఎన్నికల్లో నినదించిన జనసేన, 2024 ఎన్నికల నాటికి, తమ ఆలోచనలు మార్చుకుంది. అయితే, అధికార పీఠమెక్కాలన్న లక్ష్యాన్ని జనసేన వీడిందని అనలేం. రాష్ట్ర ప్రయోజనాలే జనసేనకు ముఖ్యమిక్కడ. ఈ క్రమంలోనే 21 సీట్లకు పొత్తలో సర్దుకుపోయారు జనసేనాని పవన్ కళ్యాణ్.
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. కానీ, రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రానికి స్థిరమైన నాయకత్వం కావాలన్న కోణంలోనే, పదిహేనేళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వుండాలని పదే పదే పవన్ కళ్యాణ్ అంటున్నారు.
దీన్ని వైసీపీ వేరే రకంగా.. అంటే, కుట్ర కోణంలో వక్రీకరించి టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయొచ్చుగాక.! కానీ, కూటమిలోని మూడు పార్టీలకీ.. మరీ ముఖ్యంగా జనసేనకీ – టీడీపీకీ మధ్య ఖచ్చితమైన అవగాహన, పొత్తులపై పూర్తి స్పష్టత వున్నాయి.