ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునని, ప్రముఖ వ్యాపారవేత్తగానూ కొందరు అభివర్ణిస్తుంటాడు. నిజానికి, అక్కినేని నాగార్జున అంటే అజాత శతృవే. అన్ని రాజకీయ పార్టీలతోనూ ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోసం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రచారకర్తగా ఎన్నికల సమయంలో కొన్ని ప్రకటనల్లో కనిపించారు అక్కినేని నాగార్జున.
ఇక, అక్కినేని నాగార్జునకి టీడీపీతోనూ సన్నిహిత సంబంధాలే వున్నాయి. అలానే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతోనూ అక్కినేని నాగార్జున సన్నిహిత సంబంధాలు నడుపుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు అక్కినేని నాగార్జున. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మీద రాసిన ఓ పుస్తకానికి సంబంధించి ప్రధానితో అక్కినేని నాగార్జున భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల హైద్రాబాద్‌లో నాగార్జునకి సంబంధించిన ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారం నేపథ్యంలో, రాజకీయంగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో వున్నారు అక్కినేని నాగార్జున.. అనేది ఓ వాదన. ఈ క్రమంలోనే, ప్రధాని నరేంద్ర మోడీని అక్కినేని నాగార్జున కలిసి వుండొచ్చన్న చర్చ ఒకటి జరుగుతోంది.
అయితే, సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల్ని కలవడంలో వింతేమీ లేదు. పైగా, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవడాన్ని రాజకీయ కోణంలో చూడలేం. సన్నిహిత సంబంధాల్ని బలోపేతం చేసుకోవడం.. అనే కోణంలోనే ఈ భేటీని చూడాల్సి వుంటుంది.
సినీ పరిశ్రమతో, సినీ పరిశ్రమలోని వ్యక్తులతో సన్నిహిత సంబంధాల్ని బీజేపీ కూడా కోరుకుంటోంది. ఈ క్రమంలోనే సినీ ప్రముఖుల్ని బీజేపీ పెద్దలు తరచూ కలుస్తుండడమూ చూస్తున్నాం.