చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఆయన రాణించారు. మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సైతం అందుకున్నారు. ఆయనకు నలుగురు కుమారులు. ‘రంగం’ ఫేమ్ జీవా ఆయన కుమారుడే. ఆర్.బి.చౌదరి స్వస్థలం రాజస్థాన్. ఆయన పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి.
ఆర్.బి.చౌదరి సినిమాల్లోకి రాకముందు జ్యూవలెరీ వ్యాపార రంగంలో రాణించారు. ఆయన తొలి సినిమా ‘ఆదిపాపమ్’ మలయాళంలో నిర్మించారు. 1990లో వచ్చిన ‘పుదువసంతం’ తమిళంలో ఆయన మొదటి సినిమా. 1994లో వచ్చిన ‘కెప్టెన్’ ఆయన నిర్మించిన తొలి తెలుగు సినిమా. పవన్ కల్యాణ్ తో 1998లో నిర్మించిన ‘సుస్వాగతం’ సినిమాతో స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. వెంకటేశ్ తో రాజా, సూర్యవంశం, శీను.. నాగార్జునతో నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తాతోపాటు ప్రియమైన నీకు, శివరామరాజు, గోరింటాకు, సంక్రాంతి సినిమాలు నిర్మించారు.
చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ కు సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పటికి 98 సినిమాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి 99వ సినిమాగా విశాల్ తో మకుటం తెరకెక్కిస్తున్నారు. ఆయన మృతిపై దక్షిణాది సినీ పరిశ్రమ మంచి అభిరుచి గల నిర్మాతను కోల్పోయినట్టయింది. ఆర్ బీ చౌదరి మృతిపట్ల చిరంజీవి, పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిరుచి గల నిర్మాతను కోల్పోవడం చిత్రసీమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.
