విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం దారపతి పంచాయతీ పరిధిలోని రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజన చిన్నారులు ప్రతిరోజూ అడవుల మధ్యగా సుమారు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో చిన్న వయసులోనే ప్రమాదాలతో పోరాడుతూ విద్యను కొనసాగిస్తున్నారు. “మా భవిష్యత్ మీ చేతుల్లో ఉంది” అంటూ వారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయపాలెం, పల్లపదుంగడ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో దబ్బగుంట నుండి పల్లపదుంగడ వరకు 6.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద రూ.4.89 కోట్ల నిధులను పవన్ కల్యాణ్ ఇప్పటికే మంజూరు చేయించారు. ఈ రహదారి మొత్తం 4.36 హెక్టార్ల రిజర్వ్ అటవీ ప్రాంతం గుండా వెళ్తుండటంతో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుండి తొలి దశ అనుమతులు పొందారు. ప్రస్తుతం అటవీ భూమి వినియోగానికి ప్రతిగా ప్రభుత్వం భూమిని ఇచ్చే అఫారెస్టేషన్ ప్రక్రియకు సంబంధించిన రెండో దశ అనుమతి వచ్చే 10 రోజుల్లో పూర్తికానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అనుమతుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రహదారి నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రాయపాలెం (19 మంది జనాభా), పల్లపదుంగడ (282), అలాగే పరోక్షంగా దారపతి (122), కురిడి (214), పొర్లూ (125) గ్రామాలకు చెందిన మొత్తం 762 మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులు అత్యవసర సేవలు పొందేందుకు సులభ మార్గం ఏర్పడనుంది.
ప్రస్తుతం వర్షాకాలంలో ఈ ప్రాంతం పూర్తిగా మట్టిగుంటలుగా మారిపోతుండటంతో రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఈ రహదారి పూర్తయితే గిరిజన గ్రామాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని స్థానికులు ఆశిస్తున్నారు. రాయపాలెం గిరిజన పిల్లల విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించగా, పనులు త్వరితగతిన పూర్తి కావాలన్న ఆకాంక్ష గ్రామస్తుల్లో కనిపిస్తోంది. దీనికి పవన్ కళ్యాణ్ కృషి బాసటగా నిలవనుంది.
