ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్ ముఖ్యం. ఇవి ఎన్ని ఉన్నా అదృష్టం కూడా తోడవ్వాలనేది ఒక మాట. కానీ.. ఒక హీరోకి అదృష్టమే వరించిందా.. లేక అతని కష్టం, నమ్మకం, టాలెంట్ నిలబెట్టాయా..? అనే అనుమానం రాక మానదు. ఆ హీరోనే రవితేజ. 12ఏళ్ల పోరాటం.. కష్టం.. ఎదురచూపులు.. ఇవన్నీ కలగలపితే రవితేజ. మనకు తెలిసింది సినిమా.. మన జీవితం సినిమా.. సినిమా.. సినిమా.. అని నేనింతే సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ రవితేజను చూసే రాసారని చెప్పాలి. ఆ పోరాటమే నేడు ఆయన్ను మాస్ మహారాజ్ ను చేసింది. టాలీవుడ్ కి ప్రామిసింగ్ హీరోను చేసింది. నేడు ఆయన పుట్టినరోజు.
ఆ ఎనర్జీ వేరు.. ఆ కిక్కు వేరు..
హీరోకు ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా.. 90ల ప్రారంభంలో చైతన్య.. ఆజ్ కా గూండారాజ్, అల్లరి ప్రియుడు.. వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించాడు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా పని చేశాడు. దీంతో సినిమాపై పట్టు సాధిస్తూ తనను తాను సానబెట్టుకున్న హీరో రవితేజ. అసిస్టెంట్ డైరక్టర్ గా రవితేజ క్లాప్ చెప్పే విధానమే హై పిచ్ లో ఉండి అటెన్షన్ క్రియేట్ చేసేదని ఉత్తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రవితేజలో ఎనర్జీ కాదు.. రవితేజే ఓ వెయ్యి ఓల్టుల ఎనర్జీ. దీనిని గుర్తించిన కృష్ణవంశీ 1997లో వచ్చిన సిందూరం సినిమాలో అవకాశం ఇచ్చారు. మాస్ క్యారెక్టర్ రవితేజ తన నటనతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్నాడంటే అతిశయోక్తి కాదు. అయినా.. వరించని అదృష్టంతో పోరాడాడు. సరిగ్గా 5ఏళ్లకు రవితేజ స్టామినాను పూరి జగన్నాధ్ వెలికి తీశాడు. ఆ సినిమానే ఇడియట్. చంటిగాడు లోకల్.. అనే డైలాగ్ తో ఆంధ్రప్రదేశ్ ను ఓ ఊపు ఊపేశాడు రవితేజ.
ఉన్నతమైన వ్యక్తిత్వం..
అక్కడి నుంచి వెనుదిరిగి చూడని రవితేజ తనదైన మార్కెట్ తో తెలుగు సినిమాలో వండర్స్ చేస్తూనే ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి పైకి ఎదిగిన హీరోల్లో చిరంజీవి తర్వాత రవితేజ పేరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. 20ఏళ్లుగా తన మార్కెట్ తగ్గలేదు. ఓదశలో రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. మాస్ హీరోగా అదే అల్లరి.. ఎనర్జీ. ఫ్లాపులు వచ్చినా తిరిగి వండర్స్ చేసి తానూ 100కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. తాను కష్టపడి ఎదిగినట్టు మిగిలినవారూ రాణించాలని కొత్త దర్శకులు, టెక్నీషియన్స్ తో పనిచేసి వారికి ఓ మార్గాన్ని చూపడం రవితేజ వ్యక్తిత్వం. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస సక్సెస్ లతో రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. త్వరలో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న రవితేజ అదే జోష్ తో మరిన్ని వండర్స్ చేయాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.