భారత దిగ్గజ వ్యాపారవేత్త, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత అయిన రతన్ టాటా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆయన నిన్న రాత్రి 11.30 గంటలకు మృతి చెందారు. దాంతో దేశ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం అవుతోంది. దేశంలోని రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది వ్యాపర దిగ్గజాలు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రేయసి అయిన బాలీవుడ్ నటి సిమి గరెవాల్ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
నువ్వు లేవని అంటున్నారు.. ఇది భరించలేనిది.. వీడ్కోలు నేస్తమా అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో రతన్ టాటాతో ఉన్న ఫొటోలను కూడా ఆమె పోస్టు చేశారు. తాను గతంలో రతన్ టాటాతో డేటింగ్ చేశానని.. కానీ పరస్పర అంగీకారంతో బ్రేకప్ అయింది అంటూ ఆమె 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో తెలిపింది. రతన్ టాటాకు పెళ్లి కాలేదు. ఆ క్రమంలోనే సిమితో ప్రేమలో పడ్డారు. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా విడిపోయారు. ఆ తర్వాత రతన్ టాటా వ్యాపరంలో అగ్ర భాగానికి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా వ్యాపారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుని నిలబడ్డారు రతన్ టాటా. తన సంపాదనలో చాలా వరకు సామాజిక సేవ చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే ఆయన్ను ఎక్కువ మంది అభిమానిస్తుంటారు.