ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను మభ్య పెట్టారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు తనకు డబ్బు ఆశ చూపారని ఆరోపించారు. క్రాస్ ఓటింగ్ వేయాలన్న ఆఫర్ తొలుత తన వద్దకే వచ్చిందన్నారు. రూ.10 కోట్లు ఇస్తామని తనతో బేరం ఆడినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ నా మిత్రుడు కేఎన్ఎస్ ప్రసాద్ ను టీడీపీ నాయకులు నా వద్దకు రాయబారానికి పంపారు. రూ. 10 కోట్లు ఇస్తామన్నారు. మంచి పొజిషన్ ఉంటుందని మభ్య పెట్టాలని చూశారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని బతకలేం. సిగ్గు శరం విడిస్తే నాకు ఆ డబ్బులు వచ్చేవి. నేను నా అధిష్టానం ప్రకారమే నడుచుకుంటానని చెప్పాను. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను’ అని అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని పార్టీ వారిని సస్పెండ్ చేసింది. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిందని వారికి రూ. 10 -15 కోట్లు డబ్బు ఆఫర్ చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజోలు ఎమ్మెల్యే సైతం ఇవే ఆరోపణలు చేయడంతో ఈ అంశం సర్వత్ర చర్చకు దారితీస్తోంది.