Rapaka Varaprasad: ‘మా ఎమ్మెల్యేలని పది నుంచి 20 కోట్ల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు..’ అంటూ వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలనూ వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే, సీక్రెట్ బ్యాలెట్ జరిగితే, తాము ఎవరికి ఓటేశామో ప్రభుత్వానికెలా తెలిసిందని సదరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.
పైగా, తాము వైసీపీ అభ్యర్థులకే ఓట్లేశామన్నది ఆయా ఎమ్మెల్యేలు కుండబద్దలుగొట్టి మరీ చెబుతున్నమాట. ఇంకోపక్క, ‘మాకు 23 ఎమ్మెల్యేల బలం వుంది. 2019 ఎన్నికల్లో మా పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలూ మా అభ్యర్థికే ఓటేశారు..’ అని టీడీపీ చెబుతోంది.
కానీ, జనసేన నుంచి వైసీపీలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం, తనకే తొలి బేరం వచ్చిందనీ, టీడీపీ తనకు 10 కోట్లు ఆఫర్ చేసిందనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపట్లేదు సరికదా, అంతటా హాస్యాస్పదమైపోయింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గనుక ముందస్తు ఆలోచన చేస్తే, రేపో మాపో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం వుంటుంది. లేదూ, షెడ్యూల్ ప్రకారమే వెళ్ళాలనుకుంటే దానికి జస్ట్ ఏడాది సమయం వుందంతే. ఈ క్రమంలో ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి చెల్లించేంత ఖర్మ ఎవరికి పడుతుంది.?
పైగా, ఈ మాట ఇంకెవరో కాదు, జనసేన నుంచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోట వచ్చింది. ‘పది కోట్లు కాదు, పది వేలు కూడా నీకు దండగే..’ అంటోంది టీడీపీ. అన్నట్టు, జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళేందుకు వైసీపీ నుంచి ఎంత గుంజావ్.? అంటూ జనసైనికులు అలాగే టీడీపీ మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం రాపాకను కడిగి పారేస్తున్నారు.